1 May, 2026 | 1:50 PM

మోదీ పాలనలోనే భారత్ సురక్షితం

11-05-2024 12:11 AM

కాంగ్రెస్ అంటే కుంభకోణాల పార్టీ

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్

కామారెడ్డి, మే 10 (విజయక్రాంతి): ప్రధాని మోదీ పాలనలోనే భారత్ సురక్షితంగా ఉంటుందని, ఆయనే మళ్లీ ప్రధాని కావాలని యావత్ దేశ ప్రజలు కోరుకుంటున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గ కేంద్రాల్లో శుక్రవారం పార్టీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. పాకిస్థాన్ వద్ద అణుబాంబు ఉంటే భయపడేందుకు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదని, తమది ప్రజల భద్రత కోసం కట్టుబడి ఉన్న బీజేపీ ప్రభుత్వమన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు తీసేసి వాటిని ఒక కమ్యూనిటీకి  ఇవ్వాలని చూస్తున్నదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు తొలగించి, ముస్లింలకు ఆ రిజర్వేషన్లు ఇస్తుందన్నారు. యూపీఏ హయాంలో రూ.12 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని, కాంగ్రెస్ పాలన అంటే కుంభకోణాలు అని అభిప్రాయపడ్డారు.

ప్రజలు బీబీ పాటిల్‌ను గెలిపించి మరోసారి పార్లమెంట్‌కు పంపాలని పిలుపునిచ్చారు. ఆయన గెలిస్తే ఒక లింగాయత్ నేత కేంద్ర మంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రచారంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జి యెండల లక్ష్మీనారాయణ, నాయకులు గుడుగుట్ల శ్రీనివాస్, ప్రసాద్, పైడిమల్ లక్ష్మీనారాయణ, స్వామియాదవ్, శంకర్‌గౌడ్, కోణాల గంగారెడ్డి, అనిల్, నాయకులు బాణాల లక్ష్మారెడ్డి, గుడుగుట్ల శ్రీనివాస్, లక్ష్మారెడ్డి, నరేందర్ రెడ్డి, అంజల్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, తేలు శ్రీనివాస్ పాల్గొన్నారు.