09-09-2025 12:09:57 AM
అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రజలకు సేవ చేయాలి
విజయక్రాంతి వార్తా కథనానికి స్పందించిన జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్
నాగర్ కర్నూల్ సెప్టెంబర్ 8 ( విజయక్రాంతి )తాసిల్దార్ కార్యాలయాల్లో తాసిల్దార్లు సమయపాలన పాటించి అవినీతికి తావు లేకుండా ప్రజలకు సేవ చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ ఆదేశించారు. తాసిల్దార్ కార్యాలయాల్లో పనులు జరగాలంటే ముడుపులు ఇవ్వాల్సిన పరిస్థితి దాపురించిందని అం దుకు ఆయా గ్రామాల స్థానిక లీడర్లను ఏజెంట్లుగా మార్చుకున్నారని అంశంలో ఈనెల 6న తాసిల్దార్ కార్యాలయాల్లో అవినీతి జలగలు అనే వార్త కథనాన్ని విజయక్రాంతి ప్రచురించింది.
దీనిపై జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ సోమవారం తాసిల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రతిరోజు ఉదయం 10:30 గంటలకల్లా కార్యాలయంలో హాజరు కావాలని బ యోమెట్రిక్ హాజరు నమోదు ద్వారానే నెలవారి జీతాలు ఇవ్వడం జరుగుతుందన్నారు.
బయోమెట్రిక్ హాజరు నమోదు చేయని వారికి జీతం నిలిపియడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రిజిస్ట్రేషన్లు ఇసుక అనుమతులు తదితర వాటికి అవినీతికి తావు లేకుండా పనులు జరగాలని లేదంటే శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. వారితోపాటు అదనపు కలెక్టర్ అమరేందర్‌ఉన్నారు.