09-09-2025 09:34:03 AM
నేడు ఉపరాష్ట్రపతి ఎన్నిక..
ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్..
సాయంత్రమే ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి..
సీక్రెట్ బ్యాలెట్ విధానంలో జరగనున్న ఎన్నికలు..
బరిలో రాధాకృష్ణన్.. జస్టిస్ సుదర్శన్ రెడ్డి..
న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్(Vice President Election) కాసేపట్లో ప్రారంభం కానుంది. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సాయంత్రం 6 నుంచి ఉపరాష్ట్రపతి ఎన్నికల ఓట్లు లెక్కించనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఎన్డీఏ అభ్యర్థిగా సీ.పీ రాధాకృష్ణన్(C.P. Radhakrishnan), ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి(B. Sudershan Reddy) ఉన్నారు. ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
రాజ్యసభ, లోక్ సభ ఎంపీలు ఎలక్టోరల్ కాలేజీ సభ్యులుగా ఉన్నారు. రహస్య ఓటింగ్, బ్యాలెట్ విధానంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు విప్ జారీ కుదరదని ఎన్నికల కమిషన్(Election Commission) ఇప్పటికే ప్రకటించింది. 771 మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బీఆర్ఎస్(Bharat Rashtra Samithi), బీజేడీ ఓటింగ్ కు దూరంగా ఉండాలని ఇప్పటికే నిర్ణయించుకున్నాయి. ఎలక్టోరల్ కాలేజీలో బీఆర్ఎస్, బీజేడీకి 11 మంది సభ్యులున్నారు. ఎన్ డీఏ కూటమికి 438 ఓట్లు వచ్చే అవకాశముంది. వైసీపీ, పలువురు స్వతంత్రులు ఎన్డీఏకు మద్దతిస్తున్నవారు. ఇండియా కూటమికి ఉభయసభల నుంచి 320 ఓట్లు వచ్చే అవకాశముంది. ఇండియా కూటమి నుంచి క్రాస్ ఓటింగ్ జరగవచ్చని ఎన్డీఏ భావిస్తోంది. 2022లో విపక్షాల అభ్యర్థిపైన ఎన్ డీఏ కూటమి అభ్యర్థి గెలిచారు. 2022లో మార్గరెట్ అల్వాపై 346 ఓట్ల మెజార్టీతో ధన్ ఖడ్ విజయం సాధించారు. ధన్ ఖడ్ అనూహ్య రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నికలు అనివార్యమయ్యాయి. రెండేళ్లు పదవీకాలం ఉండగానే జగదీప్ ధన్ ఖడ్ రాజీనామా చేశారు.