09-09-2025 12:10:37 AM
క్షేత్రస్థాయిలోకి 102 మంది నూతన అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు
మణికొండ , సెప్టెంబర్ 8 : రాష్ట్ర రవాణా శాఖలో నూతన అధ్యాయం మొదలైంది. సుదీర్ఘకాలం పాటు శిక్షణ పొందిన 102 మంది అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు (ఏఎంవీఐ) క్షేత్రస్థాయి విధుల్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. మణికొండ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో సోమవారం వారి ఆరు నెలల శిక్షణా కార్యక్రమం అధికారికంగా ముగిసింది.వివిధ చట్టాలు, వాహన సాంకేతిక పరిజ్ఞానం, ప్రవర్తనా నియమావళి వంటి పలు కీలక అంశాలపై ఈ ఆరు నెలల పాటు వీరికి సమగ్ర శిక్షణ అందించారు.
శిక్షణలో తమకు ఎన్నో విషయాలు నేర్పించిన బోధకుల సేవలను నూతన అధికారులు గుర్తుచేసుకున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వెంటనే, రవాణా శాఖ ఉన్నతాధికారులు వీరిని రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు కేటాయించారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాకు 22 మందిని కేటాయించడం గమనార్హం. పెరిగిన వాహన రద్దీ, విస్తరించిన పట్టణ ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని ఈ కేటాయింపులు జరిపినట్లు తెలుస్తోంది.ఇప్పటివరకు తరగతి గదులకే పరిమితమైన వీరికి, క్షేత్రస్థాయిలో వాహనాల తనిఖీలు, ఎన్ఫోర్స్మెంట్ నిర్వహణపై ప్రత్యేక శిక్షణ మొదలైంది.
సీనియర్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఎంవీఐ నవీన్ ఈ శిక్షణకు నేతృత్వం వహిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై కేసులు ఎలా నమోదు చేయాలి, వివిధ రకాల వాహనాలకు జరిమానాలు ఎలా విధించాలి అనే విషయాలపై వీరు సుదీర్ఘంగా వివరించారు.ఈ ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ శిక్షణ మరో 20 రోజుల పాటు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఈ నూతన దళం రాకతో రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ తనిఖీలు ముమ్మరం కానున్నాయని, రహదారి భద్రత మరింత పటిష్టం అవుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.