1 May, 2026 | 11:27 PM

బిల్లులు ఇవ్వకపోతే చావే శరణ్యం

03-12-2024 02:38 AM

నిర్మల్ కలెక్టరేట్‌ను  ముట్టడించిన సర్పంచులు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు 

‘స్థానిక’ ఎన్నికలను అడ్డుకుంటామని హెచ్చరిక 

నిర్మల్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ హయాంలో ఉన్నప్పుడు గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు ఇప్పడి వరకు బిల్లులు విడుదల కాలేదు. తాజా మాజీ సర్పంచులు సొంత ఖర్చులు వెచ్చించి పనులు చేశారు. కొందరు అప్పు లు చేసి మరీ అభివృద్ధి పనులు చేశారు. కానీ బిల్లులు విడుదల కాకపోవడంతో ఇబ్బం దులు పడుతున్నారు.

పల్లెల్లో అభివృద్ధికి అప్పులు తెచ్చి పనులు చేస్తే బిల్లులు ఇవ్వడం లేదని, ఇలా అయితే తమకు చావే శరణ్యమంటూ నిర్మల్ జిల్లాకు చెందిన తాజా మాజీ సర్పంచులు హెచ్చరించారు. ఇటీవల పంబి సర్పంచ్ పూర్ణచందర్‌గౌడ్ ఆత్మహత్యాయత్నం చేసుకోగా.. తమ బిల్లులు చెల్లించాలని ఎంతమందికి మొరపెట్టుకున్నా ఫలితం లేదని వాపోయారు.

జిల్లాకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాద య్యగౌడ్  ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. పెండింగ్ బిల్లులు చెలింపుపై హమీ ఇవ్వాలని కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ వారిని ఆహ్వానించగా.. లోపలికి వెళ్లి ప్రజవాణిని అడ్డుకొని కలెక్టర్ ఎదుట కూర్చొని నిరసన తెలిపారు.

బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని పట్టుబట్టారు. ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందని చెప్పినా వారు వినకపోవడంతో పోలీసులు జోక్యం చేసుకొని మాజీ సర్పంచులను బయటికి పంపారు. ఈ సందర్భంగా సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య మాట్లాడుతూ.. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని.. లేదంటే త్వరలో జరిగే సర్పంచ్ ఎన్నికలను అడ్డుకుంటామని హెచ్చరించారు. పంజాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో బిల్లులు చెల్లించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు పాల్గొన్నారు.