1 May, 2026 | 10:11 PM

నవంబర్‌లో 3 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు

03-12-2024 02:33 AM
  1. గతేడాది 4,986కోట్లు..
  2. ఈసారి 5,141 కోట్ల రాబడి

హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): నవంబర్‌లో జీఎస్టీ వసూళ్లు 3 శాతం పెరిగాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం నవంబర్‌లో రూ.4,986 కోట్లు వస్తే.. ఈ ఏడాది నవంబర్‌లో రూ.5,141 కోట్ల రాబడి వచ్చినట్లు కేంద్రం తెలిపింది. గతేడాదితో పోలిస్తే.. 3శాతం జీఎస్టీ వసూళ్లు పెరిగాయి.

ఇదిలా ఉండగా.. అక్టోబర్‌తో పోలిస్తే రాబడి తగ్గింది. గతనెల రూ.5,211కోట్లు రాగా.. నవంబర్‌లో రూ.70కోట్ల మేర తగ్గడం గమనార్హం. 2024-25ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఎనిమిది నెలలు పూర్తయ్యాయి. ఈ ఏడాదికి ప్రభుత్వం వాణిజ్య పన్నుల శాఖకు 18శాతం వృద్ధిని నిర్దేశించగా..

ఈ ఎనిమిది నెలల్లో ఒక్క మాసంలోనూ ఈ విభాగం లక్ష్యాన్ని సాధించలేకపోయింది. ఏప్రిల్, మే నెలల్లో వృద్ధి రేటు లక్ష్యం సమీపానికి చేరినా.. ఆ తరువాత పడిపోయింది. జూన్ నుంచి జీఎస్టీ వసూళ్లలో వృద్ధి రేటు ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది.

ఏడో స్థానంలో తెలంగాణ.. 

దేశవ్యాప్తంగా అత్యధికంగా జీఎస్టీ వసూలవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఏడోస్థానంలో నిలిచింది. నవంబర్ నాటికి తెలంగాణలో రూ.29,186 కోట్ల జీఎస్టీ వసూలైనట్లు కేంద్రం తెలిపింది. ఈ జాబితాలో తెలంగాణ రూ.1,12,174 కోట్లతో మొదటిస్థానంలో ఉంది.

రూ.56,687 కోట్లతో యూపీ రెండు, రూ.54,922కోట్లతో కర్ణాటక మూడు, రూ.51,430 కోట్లతో తమిళనాడు నాలుగు, రూ.48,096కోట్లతో గుజరాత్ ఐదు, రూ.30,737కోట్లతో పశ్చిమబెంగాల్ ఆరో స్థానంలో ఉన్నాయి. జీఎస్టీ వసూళ్లలో ఈ ఆర్థిక సంవత్సరంలోని 8నెలల సగటు వృద్ధి రేటు 7శాతం ఉంది. వృద్ధిరేటులో ఈ టాప్-7 దేశాల్లో తెలంగాణ ఆరోస్థానంలో ఉన్నది. పశ్చిమబెంగాల్ సగటు వృద్ధిరేటు కేవలం 3 శాతమే ఉంది.  

2024-25లో ఏప్రిల్-నవంబర్ వరకు 

జీఎస్టీ వసూళ్లు (రూ.కోట్లలో)

నెల 2023-24 2024-25 వృద్ధి

ఏప్రిల్ 5,622 6,236 11శాతం

మే 4,507 4,986 11శాతం

జూన్ 3,183 3,352 5.3శాతం

జులై 4,849 4,940 2శాతం

ఆగస్టు 4,393 4,569 4శాతం

సెప్టెంబర్ 5,226 5,267 1శాతం

అక్టోబర్ 4,868 5,267 7శాతం

నవంబర్ 4,986 5,141 3శాతం