బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్‌ను బద్నాం చేస్తే ఊరుకోం

02-05-2024 01:57:40 AM

సీఎం సీటు పోతుందేమోనని రేవంత్‌కు భయం పట్టుకుంది

రిజర్వేషన్ల రద్దు నాటకం కాంగ్రెస్ కుట్రలో భాగమే

రెండో స్థానం కోసమే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పోటీ

సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలపై బండి సంజయ్ ధ్వజం

కరీంనగర్‌లో కేంద్ర మంత్రి మురుగన్‌తో కలిసి రోడ్ షో


కరీంనగర్, మే 1(విజయక్రాంతి): తెలంగాణలో ఏ సర్వే చూసినా బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పడం తో సీఎం రేవంత్ రెడ్డికి భయం పట్టుకుంద ని.. సీఎం సీటు పోతుందనే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి.. బీజేపీని, ఆర్‌ఎస్‌ఎస్‌ను బద్నాం చేసే లా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగం గా కరీంనగర్‌లోని కమాన్ చౌరస్తా వద్ద బుధవారం రాత్రి నిర్వహించిన రోడ్ షోలో కేంద్ర మంత్రి మురుగన్‌తో కలిసి పాల్గొన్నా రు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడు తూ.. రిజర్వేషన్ల రద్దు కోసమే 2000 సంవత్సరంలో జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ ను బీజేపీ ప్రభుత్వం నియమించిందని, ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్టును కూడా తొక్కిపెట్టారని చెబుతున్న రేవంత్ రెడ్డి.. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆ రిపోర్టును ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్ రాముడి పేరు చెబితేనే గజగజ వణుకుతోందని.. రాక్షసులు, సైతాన్లు మాత్రమే దేవుడిని చూస్తే వణికిపోతారని ఎద్దేవా చేశారు. కరీంనగర్ లో దేవుడిని కొలిచే ప్రతి ఓటరు ఈ నెల 13న జరిగే పోలింగ్‌లో పాల్గొనాలని కోరుతున్నానన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు రెండో స్థానం కోసమే పోటీ పడుతున్నాయని ఎద్దేవా చేశారు.  కాం గ్రెస్ అభ్యర్థి ఎన్నడైనా మీకు కన్పించారా.. కష్టాల్లో ఉంటే కనీసం పరామర్శించారా.. అలాంటి వ్యక్తికి ఎందుకు ఓటేయాలి అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి నాన్ లోకల్ అని, 10 ఏళ్లు అధికారంలో ఉన్నా కరీంనగర్ ప్రజలకు చేసిందేమీ లేదని, కేసీఆర్ కుటుంబానికి దోచిపెట్టడం, దాచుకోవడం తప్ప ఆయన సాధించింది ఏమిటని ప్రశ్నించారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ నన్ను వెధవ అంటూ తిడుతున్నాడని, అవ న్నీ ఆయన విచక్షణకే వదిలేస్తున్నానని అన్నా రు. తాను ఎంపీగా కరీంనగర్ అభివృద్ధికి రూ.12 వేల కోట్లకుపైగా నిధులు తెచ్చానని, ప్రజల పక్షాన పోరాడానని గుర్తు చేశారు.

సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో మహిళల అ కౌంట్‌లలో నెలనెలా రూ.2500 వేస్తామని, పింఛన్లు రూ.4 వేలు, రైతుబంధు రూ.15 వేలు చేస్తామని, వరి క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు గాడి ద గుడ్డు చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. తమిళనాడులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి పార్టీని విస్తరించిన నాయకుడు మురుగన్ అని, ఎంపీ కాకపోయినా దళితుడైన మురుగన్ సేవలను గుర్తించి నేరుగా కేంద్ర మంత్రిని చేసిన ఘనత మోదీదే అన్నారు.