calender_icon.png 8 November, 2025 | 5:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడవిని ధ్వంసం చేస్తే మొక్కలు నాటాలి

08-08-2024 01:23:18 AM

హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్ ఆగస్టు 7 (విజయక్రాంతి): అటవీ నేరాలకు పాల్పడి, అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేస్తే, ఆ ప్రాంతంలో మొక్కలు నాటాలని హైకోర్టు ఆదేశించింది. ఇందుకు అవసరమైన మొక్కలను నేరం చేసినవారికి అటవీ శాఖ అధికారులు అందజేయాలని ఉత్తర్వులిచ్చింది. లింగాల రేంజ్ ఫారెస్ట్ అధికారి సీజ్ చేసిన ట్రాక్టర్‌ను విడుదల చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ మంచిర్యాల జిల్లా జిల్లెడ మండలానికి చెందిన ఎం మల్లేశ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టారు.

పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ వ్యవసాయదారు అయిన మల్లేశ్‌పై కుష్నేపల్లి రేంజ్‌లోని లింగాల సెక్షన్ లో ట్రాక్టర్ ద్వారా రెండెకరాల మేర అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేశారన్న ఆరోపణపై అటవీ సెక్షన్ అధికారి జూలై 1న కేసు నమోదు చేసి, ట్రాక్టర్ను సీజ్ చేశారని తెలిపారు. పిటిషనర్ ట్రాక్టర్ యజమాని అని, వ్యవసాయ పనుల కోసం మరో వ్యక్తికి అద్దెకిచ్చినట్టు తెలిపారు. అద్దెకిచ్చినందుకు యజమాని అయిన పిటిషనర్, డ్రైవర్‌పై కేసు నమోదు చేశారని చెప్పారు. సీజ్ చేసిన ట్రాక్టర్‌ను కోర్టులో అప్పగించారని, దాన్ని వినియోగించని పక్షంలో ట్రాక్టర్ పాడయ్యే అవకాశం ఉందని అన్నారు.

ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్ తరచూ నేరాలకు పాల్పడుతుంటారని చెప్పారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి గతంలో ఇలాంటి కేసులోనే వాహనం విడుదలకు హైకోర్టు కొన్ని షరతులు విధించిందని, వీటి ప్రకారం రూ.50 వేలు డిపాజిట్ చేయాలని, ట్రాక్టర్‌ను అన్యాక్రాంతం చేయనని, అధికారులు అడిగినపుడు ట్రాక్టర్ వచ్చేలా హామీని అటవీ శాఖాధికారులకు సమర్పించాలని సూచించారు. ప్రస్తుత కేసులో ఈ షరతులతోపాటు ధ్వంసమైన రెండెకరాల అటవీ ప్రాంతంలో 200 మొక్కలు నాటాలని, వాటిని పిటిషనర్‌కు అందజేయాలని సూర్యాపేట జిల్లా అటవీశాఖాధికారిని ఆదేశించారు. ఈ ఉత్తర్వుల అమలుపై నివేదిక సమర్పించాలని అటవీశాఖాధికారులను ఆదేశిస్తూ విచారణను సెప్టెంబరు 6కు వాయిదా వేశారు.