జైల్లో చనిపోతే పరిహారం ఇవ్వాల్సిందే
ఖైదీల రక్షణ బాధ్యత అధికారులదే.. స్పష్టం చేసిన తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి): జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల రక్షణ బాధ్యత సంబంధిత అధికారులదేనని, ఖైదీలకు రాజ్యాంగంలోని అధికరణ 21 కింద ఉన్న అన్ని హక్కులు ఉంటాయని హైకోర్టు స్పష్టంచేసింది. చట్టం పరిధిలో మినహాయింపులు తప్పా.. రాజ్యాంగ హక్కులను తిరస్కరించడానికి వీల్లేదని ఉద్ఘాటించింది. అధికారులు తమ బాధ్యత నుంచి తప్పించుకోలేరని పేర్కొంది. జైల్లో శిక్ష అనుభవిస్తూ తోటి ఖైదీల దాడిలో మృతిచెందిన కరోళ్ల వెంకయ్య భార్య కరోళ్ల జయమ్మకు రూ.7.20 లక్షల పరిహారం, 6 శాతం వడ్డీతో చెల్లించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి తీర్పు చెప్పారు.
సంగారెడ్డి కోర్టు తీర్పుతో కరోళ్ల వెంకయ్య చర్లపల్లి జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు. నిజామాబాద్ జిల్లా జైలు నుంచి దాసరి నరసింహులును చర్లపల్లికి తరలించారు. జైలు అధికారుల వివరాల ప్రకారం.. క్షురకుని వద్ద విరిగిపోయిన కత్తెరను తస్కరించిన దాసరి నరసింహులు.. 2012 జులై 4న తెల్లవారుజామున వెంకయ్యతోపాటు మరో ఆరుగురు ఖైదీలపై దాడి చేశాడు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వెంకయ్య మరణించాడు. దీనిపై కుషాయిగూడ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. దీనిపై మెజిస్టీరియల్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.
విచారణ జరిపిన అప్పటి కలెక్టర్ 2013 డిసెంబరు 19న నివేదిక ఇచ్చారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా కేసు దర్యాప్తు చేసి, బాధిత కుటుంబానికి రూ.లక్ష పరిహారం చెల్లించాలంటూ ఆదేశాలు జారీచేసింది. 2018లో రూ.లక్ష జయమ్మకు అందజేశారు. కాగా, జైలు అధికారుల నిర్లక్ష్యం లేదని ప్రభుత్వం చేసిన వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. వెంకయ్య మరణించినప్పుడు పరిహార లెక్కింపులకు ఒక విధానం అంటూ ఏమీ లేదని, మోటారు వాహన ప్రమాదాల చట్టం కింద పరిహారం లెక్కించారని చెప్పింది.
మృతుడు వెంకయ్య వయస్సు 55 ఏళ్ళుకాగా అతని ఆదాయం వివరాలను ఎక్కడా పేర్కొనలేదని, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నైపుణ్యం లేని కార్మికులకు నెలకు రూ.7,200 చెల్లించాలన్న నిబంధన ప్రకారం ఏడాదికి రూ.88,400లో మూడో వంతు సొంత ఖర్చులుపోగా మిగిలిన రూ. 57,600 గత 11 ఏళ్లకు రూ.6,33,600 చెల్లించాలని తీర్పు చెప్పింది. ఆ మొత్తంతోపాటు అంత్యక్రియల ఖర్చుల కింద మరో రూ.84 వేలు కలిపి మొత్తం రూ.7.20 లక్షలు చెల్లించాలని పేర్కొంది. ఇప్పటికే చెల్లించిన రూ.లక్షను మినహాయించిన మిగిలిన మొత్తానికి ఆరు శాతం వడ్డీ జమ చేసి చెల్లించాలని స్పష్టంచేసింది.






