తాగొద్దంటే.. చావకొట్టారు
- ఇళ్ల మధ్య మద్యం సేవించిన యువకులు
- వెళ్లిపోవాలని ఇంటి యజమాని హెచ్చరిక
- కర్రలు, రాళ్లతో దాడి చేసిన ఆకతాయిలు
ఎల్బీనగర్, జూన్ 14 : ఇండ్ల ఎదుట తాగొద్దన్నందుకు ఓ ఇంటి యజమానిని ఆకతాయిలు చావబాదిన ఘటన సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకున్నది. సరూర్‌నగర్ సీఐ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం అర్ధరాత్రి చైతన్యపురి మెట్రోస్టేషన్ సమీపంలో ఉన్న నేతాజీనగర్‌లోని ఖాళీ స్థలంలో శంకుయాదవ్, వంశీ, వహీద్, హరీశ్, సోనూ, సుమన్‌తోపాటు మరికొందరు మద్యం సేవిస్తున్నారు. స్థలానికి ఎదురుగా ఉన్న ఇంటిలో అద్దెకు ఉంటున్న వ్యక్తి వారిని అక్కడ తాగొద్దని హెచ్చరించడంతో ఆకతాయిలు అతడితో గొడవపడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటే సదరు వ్యక్తి వారి ఫొటోలు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
తాగిన మైకంలో ఉన్న ఆకతాయిలు గట్టిగా అరుస్తూ ఆ ఇంటి కిటికీలు, అద్దాలను పగులగొట్టారు. ఇంటి ఎదుటే మద్యం తాగుతున్నారు. వారి భయంతో ఇంట్లో ఉన్నవారు బయటకు రాలేదు. ఇంటి యజమాని జనార్ధన్‌నాయుడికి సమాచారం ఇవ్వగా ఆయనకు అక్కడు చేరుకుని ఆకతాయిలను అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించాడు. అప్పటికే తాగిన మైకంలో కోపంతో ఊగిపోతున్న ఆకతాయిలు జనార్ధన్‌పై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. స్థానికులు అక్కడికి వస్తుండడాన్ని గమనించిన ఆకతాయిలు పరారయ్యారు. జనార్ధన్‌ను స్థానికులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదుతో సరూర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, శుక్రవారం ఏడుగురిని అరెస్టు చేశారు.






