కట్టింది కొన్నే.. ఇచ్చేది ఎన్నో?!
- లబ్ధిదారుల సంఖ్యకు పొంతనలేని డబుల్ బెడ్రూం ఇండ్లు
నిర్మాణం పూర్తి కాకుండానే లబ్ధిదారుల జాబితా ఖరారు
ఎన్నికల ముందు హడావుడిగా గుర్తించిన అప్పటి సర్కారు
సూర్యాపేట పట్టణంలో 804 మందికి పట్టాలు పంపిణీ
పూర్తి అయిన ఇండ్లు 384, మిగతావి నిర్మాణ దశలోనే !
సూర్యాపేట, జూన్14 (విజయక్రాంతి): సూర్యాపేట పట్టణంలో డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు నిరాశే మిగులుతోంది. ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకొని ఏళ్లుగా ఎదురు చూస్తున్న పేదలకు ఎన్నికల ముందు ఇండ్లు అందినట్టే అనిపించినా నేటికీ ఆ ఆశ నెరవేరలేదు. ఇకపై నెరవేరేలా కనబడటం లేదు. నిర్మాణం పూర్తి కాని ఇండ్లను చూపి ఎన్నికల ముందు లెక్కకు మించిన లబ్ధిదారులను ఎంపిక చేసి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మోసం చేసి, అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు దండుకుందనే అపవాదును మూటకట్టుకుంది.
అసలేం జరిగిందంటే...
సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్రూం ఇండ్లకోసం 7 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 2,716 మందిని అర్హులుగా రెవెన్యూ అధికారులు గుర్తించారు. 2023 అక్టోబర్ 1న కలెక్టరేట్‌లో డ్రా పద్ధతిన 804 మందిని ఎంపిక చేశారు. అక్టోబర్ 2న మాజీ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పట్టాలు కూడా పంపిణీ చేశారు. ఇండ్లు మాత్రం కేటాయించలేదు. ఈలోగా ఎన్నికల కోడ్ రావడంతో ఎన్నికల తరువాత తమకు ఇండ్లు వస్తాయని అంతా భావించారు.
మొండిగోడలకే పరిమితం!
ఎన్నికలు ముగిశాక తమకు కేటాయిస్తారని భావించిన ఇండ్ల వద్దకు వెళ్లి చూస్తే సగం లో నిర్మాణం ఆగి దర్శనమిచ్చాయి. పిల్లర్లు, మొండి గోడలు, తలుపులు, కిటికీలు లేని గదులు చూసి లబ్ధిదారులు నివ్వెరపోయారు. నిర్మాణం పూర్తికాని ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని తెలిసినా అప్పటి ప్రజాప్రతినిధుల ఒత్తిడితో అధికారులు మమ అనిపించారు. ఆ ఎంపికలోనూ అవకతవకలు జరిగాయనే ఆరోపణలున్నాయి
939 ఇండ్ల నిర్మాణం ప్రారంభించినా..
ఇండ్లు లేని పేదల కోసం సూర్యాపేట జిల్లా కేంద్రంలో 939 ఇండ్లు నిర్మించాలని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. 2017లో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించింది. గాంధీనగర్‌లో 75, కేసారంలో 480, ఇందిరమ్మ కాలనీ ఫేజ్‌న 384 రెండు పడుక గదులను నిర్మించవలసి ఉంది. గడిచిన ఏడు సంవత్సరాలలో ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 384 ఇండ్లు మాత్రమే పూర్తి అయ్యాయి. గాంధీనగర్‌లో 75 ఇండ్లకు 48 నిర్మాణ దశలో ఉన్నాయి. మిగతా వాటికి ఇంకా పునాదులే పడలేదు. కేసారం వద్ద నిర్మిస్తున్న 480 ఇండ్ల నిర్మాణం 70 శాతం పూర్తి కాగా గత రెండు సంవత్సరాల క్రితం కాంట్రాక్టర్ బిల్లులు రావడం లేదని మధ్యలోనే వదిలేసి వెళ్లారు. ఇలాంటి స్థితిలో ఉన్న ఇండ్లకు అధికారులు డ్రా తీసి లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇప్పుడు ఎలా కేటాయించాలో అర్థంకాక తల పట్టుకుంటున్నారు. కాగా తమకు ఎలాగైనా ఇండ్లు కేటాయించాలని లబ్ధిదారులు వేడుకుంటున్నారు.






