..వద్దంటే మీరు గుహలో బతకాల్సి వస్తుంది!
ఢిల్లీ హైకోర్టులో బాలీవుడ్ నటీమణులు, అక్కాచెల్లెళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌లకు తమ వ్యక్తిత్వ హక్కుల కేసుల్లో వేర్వేరు అనుభవాలు ఎదురయ్యాయి. ఇద్దరికీ అశ్లీల కంటెంట్ తొలగింపు విషయంలో న్యాయస్థానం నుంచి రక్షణ లభించినప్పటికీ, సోషల్ మీడియా వ్యాప్తి, ఫ్యాన్ పేజీలపై కోర్టు స్పందించిన తీరు భిన్నంగా ఉంది. డిజిటల్ యుగంలో సెలబ్రిటీల గుర్తింపును, ఫోటోలను దుర్వినియోగం చేయడంపై దివంగత నటి శ్రీదేవి కుమార్తెలు, బాలీవుడ్ తారలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ ఇద్దరూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
ఏఐ, డీప్ ఫేక్ సాంకేతికత ద్వారా తమ పేర్లు, ఫోటోలను ఉపయోగించి సృష్టించిన అశ్లీల కంటెంట్, నకిలీ అకౌంట్లు, అనధికారిక వ్యాపార ఉత్పత్తుల నిలిపివేత కోసం వారు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. జాన్వీ కపూర్ 6 వేలకు పైగా వెబ్‌సైట్ లింక్‌లు, సోషల్ మీడియా పోస్టులను పూర్తిగా నిలిపివేయాలని కోర్టును కోరింది. ఇందులో ఆమె ఫ్యాన్ పేజీలు కూడా ఉన్నాయి. అయితే, జస్టిస్ అనుప్ జైరామ్ భంభాని నేతృత్వంలోని బెంచ్.. ఆమె పేరుతో ఉన్న స్పష్టమైన అశ్లీల, పోర్నో గ్రాఫిక్ కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని ఆదేశించింది.
అయితే, అన్ని ఫ్యాన్ పేజీలపై, వేలాది లింక్‌లపై గుడ్డిగా నిషేధం విధించలేమని కోర్టు తేల్చి చెప్పింది. డిజిటల్ ప్రపంచంలో సెలబ్రిటీలకు అభిమానులు ఉండటం సహజమని, కేవలం విమర్శలు లేదా వ్యంగ్యంగా పెట్టే పోస్టులను అడ్డుకోలేమని పేర్కొంది. ‘మీకు అభిమానులు వద్దు అనుకుంటే.. మీరు గుహలో బతకాల్సి వస్తుంది’ అంటూ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కచ్చితమైన అశ్లీల లింక్‌ల జాబితాను మాత్రమే వర్గీకరించి ఇవ్వాలని స్పష్టం చేశారు.
జాన్వీ కపూర్ కేసు విచారణ జరిగిన మరుసటి రోజే ఆమె సోదరి ఖుషీ కపూర్ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ జ్యోతి సింగ్ ఈ పిటిషన్‌ను విచారించారు. ఖుషీ కపూర్‌కు ఊరటనిస్తూ సోషల్ మీడియా వేదికల నుంచి ఆమెకు సంబంధించిన అశ్లీల కంటెంట్‌ను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఆమె అనుమతి లేకుండా, ఆమె గుర్తింపును వాడుకుంటూ సోషల్ మీడియాలో విక్రయిస్తున్న అనధికారిక ఉత్పత్తులను కూడా నిలిపివేయాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా, గుర్తుతెలియని వ్యక్తులు ఆమె వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించకుండా కోర్టు సానుకూల రక్షణ కల్పించింది. ఖుషీ తరఫు న్యాయవాదులు కోర్టు కోరిన విధంగా ముందే లింక్‌లను వర్గీకరించి ఇవ్వడంతో ఈ ప్రక్రియసాఫీగా సాగింది.






