హైవే 65పై మృత్యు ఘోష!
- వరుస ప్రమాదాలకు నిలయంగా జాతీయ రహదారి
- ప్రాణాలు తీస్తున్న విస్తరణ పనులు
- సంగారెడ్డి జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలు
- నిర్లక్ష్యపు నిద్రలో అధికారులు
సంగారెడ్డి బ్యూరో, ఆగస్టు 12 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లాలో జాతీయ రహదారి 65 రక్తాశ్రువులు కురిపిస్తోంది. నిత్యం వేలాది వాహనాలతో బిజీగా ఉండే ఈ హైవే అమాయక ప్రయాణికుల పాలిట యమపాశంగా మారుతోంది. మంగళవారం రాత్రి జిల్లా పరిధిలో జరిగిన రెండు ఘోర ప్రమాదాలు పలు కుటుంబాల్లో తీరని చీకట్లను నింపాయి.
మొగడంపల్లి మండలం సత్వర్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై యూ-టర్న్ తీసుకుంటున్న ఒక ఆటోను, ఎదురుగా అతివేగంతో వచ్చిన ఆయిల్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు కర్ణాటకకు చెందిన వలస కూలీలు అక్కడికక్కడే మరణించారు. అలాగే హైవేపై కావేలి గ్రామ పరిధిలో జరిగిన మరో ప్రమాదంలో నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ఒక కారు అదుపు తప్పి రోడ్డు డివైడర్ను ఢీకొట్టి, అవతలి వైపు వస్తున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.
నాలుగు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పోలీస్, జాతీయ రహదారుల సంస్థ రికార్డుల ప్రకారం, తెలంగాణలోనే అత్యధిక ప్రమాదాలు జరిగే అత్యంత ప్రమాదకరమైన రోడ్డుగా జాతీయ రహదారి 65 రికార్డుకెక్కింది. హైవేపై వాహనాలు నియంత్రణ లేని వేగంతో దూసుకుపోవడమే ప్రమాదాలు జరుగుతున్నాయి. లింగంపల్లి నుంచి సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు జరుగుతున్న ఆరు లేన్ల విస్తరణ పనుల వల్ల కనీస హెచ్చరిక బోర్డులు లేకపోవడం, శాస్త్రీయత లేని మలుపులు, యూ-టర్నుల వద్ద రక్షణ చర్యలు కరువవ్వడమే కారణమని తెలుస్తోంది.
రహదారి భద్రతా లోపాలు..
కేవలం డ్రైవర్ల తప్పుల వల్లే కాకుండా, రోడ్డు నిర్వహణ లోపాల వల్ల కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. మొగడంపల్లి మండలం సత్వర్ వద్ద జరిగిన ప్రమాదానికి ప్రధాన కారణం యూ-టర్న్. హైవేపై వాహనాలు 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వస్తున్నప్పుడు, ఎలాంటి ముందస్తు హెచ్చరిక బోర్డులు లేకుండా సడన్గా యూ-టర్న్లు రావడం మరణశాసనంగా మారుతోంది. నేషనల్ హైవేస్ అథారిటీ గుర్తించిన బ్లాక్ స్పాట్స్ వద్ద ఇప్పటికీ సరైన బ్లింకర్ లైట్లు లేదా రక్షణ గోడలు ఏర్పాటు చేయలేదు.
ప్రస్తుతం సంగారెడ్డి కంది నుంచి మడిగెల్ వరకు జాతీయ రహదారి 65పై ఆరు లేన్ల విస్తరణ పనులు జరుగుతున్నాయి. రోడ్డు తవ్వకాలు జరిపిన చోట, డైవర్షన్లు ఇచ్చిన చోట కనీస రేడియం సూచిక బోర్డులు, రిఫ్లెక్టర్లు పెట్టడం లేదు. రాత్రి వేళల్లో లైటింగ్ లేకపోవడంతో డ్రైవర్లు అకస్మాత్తుగా బ్రేకులు వేయడం వల్ల వాహనాలు అదుపు తప్పుతున్నాయి. హైవే ఇరుపక్కలా ముఖ్యంగా హోటళ్లు, డాబాల వద్ద భారీ వాహనాలను (కంటైనర్లు, ట్యాంకర్లు) రోడ్డుపైనే ఇష్టానుసారంగా పార్క్ చేస్తున్నారు.
వీటి వల్ల వెనుక నుంచి వచ్చే వాహనాలకు రోడ్డు సరిగ్గా కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. హైవే పెట్రోలింగ్ పోలీసులు వీటిని నియంత్రించడంలో విఫలమవుతున్నారు. అన్ని ప్రధాన క్రాసింగ్లు, యూ-టర్న్ల వద్ద రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేసి వాహనాల వేగాన్ని తగ్గించాలి. ఓవర్ స్పీడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ను అడ్డుకోవడానికి స్పీడ్ గన్లు, సీసీ కెమెరాల నిఘా పెంచాలి. విస్తరణ పనులు జరుగుతున్న జోన్లలో రాత్రి వేళల్లో స్పష్టంగా కనిపించేలా ఎల్‌ఈడీ బ్లింకర్లను వెంటనే అమర్చాలి.






