13 August, 2026 | 3:50 AM

పట్టం కట్టేదెవరికి?

13-08-2026 01:18 AM

రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు

  1. జంతర్ మంతర్ జెన్-జీ ఉద్యమంతో కమలం పార్టీలో కలవరం
  2. గ్రాడ్యుయేట్ల ఓట్లే లక్ష్యంగా బీజేపీ త్వరలో ఉద్యమబాటకు వ్యూహరచన

హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు పార్టీల్లో కాకపుట్టిస్తున్నాయి. ఎవరికి జెన్-జీ మద్దతు ఉంటుందో వారికే గెలుపు అవకాశాలు ఎక్కువని పరిశీలకు లు భావిస్తున్నారు. సాధారణ ఓటర్ల నాడి పట్టొచ్చు కానీ, గ్రాడ్యుయేట్ల  మైండ్ సెట్ ను అంచనా వేయడం ఏ పార్టీకైన కష్టసాధ్యమే. ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమం, లాఠీఛార్జ్‌తో బీజేపీకి యువత దూరమయ్యారనే ప్రచా రం జరుగుతోంది.

ఇది కమలం పార్టీని కలవరపెడుతున్న అంశం. ఆ ఉద్యమానికి ప్రతి రాష్ట్రంలోని యువత పరోక్షంగా మద్దతు తెలిపారు. దీనికితోడు స్థానికంగా గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగుల సమస్యలు, హక్కులపైన బీజేపీ తన వైఖరీ స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. ఈక్రమంలోనే రాష్ట్రంలోని గ్రాడ్యుయేట్లను తమవైపు ఏ విధంగా తిప్పుకోవాలనే విషయంపై రాష్ట్ర నాయకత్వం వ్యూహరచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నీట్ పేపర్ లీక్ ఘటనను యువత మైండ్‌ల నుంచి తొలగించి.. బీజేపీకి వారి మద్దతు కూడగట్టుకునేలా కొత్త ప్లాన్‌లను అమలుచేసే పనిలో బీజేపీ ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఈసారి గట్టిపోటీ!

తెలంగాణలో త్వరలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతు న్నాయి. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్- ఖమ్మం-నల్ల గొండ నియోజకవర్గాలకు 2027 మార్చి తో పదవీకాలం ముగియనున్నది. ఇప్పటినుంచే ప్రధాన మూడు పార్టీలు అప్రమత్తమవుతున్నాయి. ఈసారి కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య గట్టిపోటీయే ఉండబోతోంది. ఎవరికి వారు విజయం సాధించేందుకు గ్రౌండ్ వర్క్‌ను సిద్ధం చేసుకుంటున్నారు.

ఇందులో కమలం పార్టీ ఓ అడుగు ముందే ఉంది. ఇటీవల ఇదే విషయమై ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో రాష్ట్ర నాయకత్వం భేటీ అయింది. ఇప్పటినుంచే గ్రాడ్యుయేట్ ఎన్నికలపై ఫోకస్ చేయాలని, ఆ రెండు స్థానాల్లో గెలిచేలా ప్రత్యేక కార్యాచరణను అమలుచేసుకొని ప్రజా క్షేత్రంలో దూసుకెళ్లాలని స్పష్టమైన దిశానిర్ధేశం చేసింది.

దీనికనుగుణం గానే రాష్ట్ర నాయకత్వం త్వరలోనే గ్యాడ్యుయేట్, నిరుద్యోగులు, యువత, ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలు సెంట్రిక్‌గా ఉద్యమాలు చేపట్టబోతున్నారు. ఆగస్టు 15 తర్వాత తమ సత్తా చూపిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఇప్పటికే ప్రకటించారు. 

జెన్ జీ రాగం ఎత్తకపోతే కష్టమే..

ఈ ఎన్నికల్లో జెన్‌జీ ప్రభావం క్రియాశీలకంగా ఉంటు ందనే చర్చ జరగుతోంది. దీనికి సంబంధించిన ఓటరు నమోదు ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. బీఆరెస్, బీజేపీ, కాంగ్రెస్ .. ఈ మూడు పార్టీలు ఈ రెండు ఎమ్మె ల్సీ సీట్లపై ప్రధాన దృష్టిపెట్టాయి. అయితే ఇటీవల అనూహ్యంగా తెరపైకి వచ్చిన జెన్-జీ ఉద్యమం కారణంగా ఈ సారి ఈ రెండు స్థానాల్లో పట్టభద్రులు ఎవరి వైపు ఉంటారనే చర్చ మొదలైంది.

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడో స్థానానికి పరిమితమైనా.. పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం స్పీడ్ భారీ ఓట్ షేరింగ్‌తో ఎనిమిది సీట్లు గెలుచుకుంది. దీనికి కారణం మోడీ ప్రభంజనమే. కానీ ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతుందా?, జెన్ ఎఫెక్ట్ పడుతుందా? అనేది చర్చనీయాంశంగా మారింది.

యువత బీజేపీ నుంచి పక్కదారి పడుతున్నారా?, ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ను ఎంచుకుంటు న్నారా అనే అభిప్రాయాలు వినవస్తున్నాయి. జెన్-జీ రాగం ఎత్తుకోకుంటే రాబోయే ఎన్నికల్లో క్లిష్టపరిస్థితులు తప్పవని భావించిన బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఇప్పటికే యువత బాటపట్టాయి. కాంగ్రెస్ ఏకంగా.. జెన్ చట్టసభల్లో అవకాశాలు కల్పించేందుకు ముందుకు వస్తోంది.