13 August, 2026 | 3:51 AM

షార్ట్‌కట్‌లతో ముప్పే

13-08-2026 01:16 AM
  1. నేరుగా రైల్వేట్రాక్‌లను దాటడం ప్రమాదకరం
  2. లక్ష్యసాధనలో తొందరపాటు నిర్ణయాలొద్దు
  3. ఇన్‌ఫ్లుయెన్సర్ల ఉచ్చులో పడొద్దు
  4. మాజీ రాష్ట్రపతి కోవింద్ ఆత్మకథ పుస్తకావిష్కరణలో ‘జెన్ జీ’కి ప్రధాని నరేంద్ర మోదీ సూచనలు

* ఇది రీల్స్ యుగం. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు వాళ్ల మార్గంలో యువతను తీసుకెళ్తుంటారు. ఇది షార్ట్‌కట్‌ల కాలం కూడా. అలా షార్ట్‌కట్‌లతోనే జీవితం సాగించాలనుకుంటే.. మీరు బాగా ఇష్టపడేవారి ఆత్మకథ చదవాలి. కోవింద్ లాంటివారు భవిష్యత్‌లోనూ మనకు అవసరం. ఎంత గడ్డు పరిస్థితులు వచ్చినా.. ఎంచుకున్న మార్గం వీడకుండా సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు వెళ్లాలి. 

 ప్రధాని నరేంద్ర మోదీ

ఢిల్లీ, ఆగస్టు 12: జీవితంలో త్వరగా లక్ష్యాన్ని చేరుకోవాలనే తొందరలో ఎంచుకునే షార్ట్‌కట్ మార్గాలు ఒక్కోసారి తీవ్ర నష్టాలకు దారితీస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. ముందుకు సాగాలంటే అర్థ వంతమైన, సరైన మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. మాజీ రాష్ట్ర పతి రామ్‌నాథ్ కోవింద్ రాసిన ఆత్మకథ ‘ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిప బ్లిక్ లైఫ్, మై స్ట్రగుల్స్’ పుస్తకావిష్కరణ కార్యక్రమం బుధవారం ఉదయం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ‘జెన్ జీ’ని యువతకు పలు సూచనలు చేశారు. కొందరు ఫుట్‌బ్రిడ్జ్‌లను ఉపయోగించకుండా రైల్వే పట్టాలను దాటుతుంటారని, ఇలాంటి ప్రమాదకరమైన నిర్ణయాల వల్ల కలిగే నష్టాలను తెలియజేసేందుకే రైల్వేస్టేషన్లలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు.

‘ఏ షార్ట్ కట్ విల్ కట్ యూ షార్ట్’ అని ఆ బోర్డులు హెచ్చరికలు చేయడమే కాకుండా, జీవితానికి పాఠాలు నేర్పుతాయన్నారు. ప్రస్తుతం యువతపై ఇన్‌ఫ్లు యెన్స ర్లు, రీల్స్ తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, వీటి ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. 

స్ఫూర్తి పొందాలి..

నేటి డిజిటల్ యుగంలో ‘జెన్ జీ’లో ఏకాగ్రత, లోతైన ఆలోచన శక్తి తగ్గిపోతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సమయం వృథా చేయకుండా, జీవితంలో నిజమైన పాఠాలు నేర్చుకోవడానికి మహనీయులు, నాయకుల ఆత్మకథలను చదవాలన్నారు. ఆత్మకథలు చదవటం వల్ల వారు ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాల నుంచి ఎంతో నేర్చుకోవచ్చన్నారు.

పుస్తకపఠం వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడమే కాకుండా, సమా జం పట్ట బాధ్యతాయుతమైన దృక్పథాన్ని పెంపొందిస్తుందన్నారు. యువత డిజిటల్ యుగానికి పరిమితం కాకుండా నిరంతరం పుస్తకాలు చదవడం కొనసాగించాలని, దేశానికి సేవ చేసిన వారి అనుభవాలను చదివి స్ఫూర్తి పొందాలని స్పష్టం చేశారు.  జీవితంలో ఉన్నత శిఖరాలను చేరువాలంటే ఎప్పటికైనా కష్టపడే తత్వమే విజయాన్ని ఇస్తుందన్నారు. 

కోవింద్‌పై మోదీ ప్రశంసలు..

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌పై ప్రధాని ప్రశంసలు కురిపించారు. సామాన్య కుటుంబంలో జన్మించిన రామ్‌నాథ్ కోవింద్ జీవితం పట్టుదలకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ఎన్నో కష్టాలను ఓపికగా ఎదుర్కొని దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిని అధి రోహించారని పేర్కొన్నారు. రాష్ట్రపతి పదవి నుంచి విరమణ చేసిన తర్వాత కూడా కోవింద్ విశ్రాంతి తీసుకోకుండా దేశ ప్రయోజనాలకు సంబంధించిన కీలక అంశాలపై పనిచేస్తున్నారని కొనియాడారు.

ముఖ్యంగా ‘వన్ నేషన్-- వన్ ఎలక్షన్’ (జమిలి ఎన్నికలు) వంటి అంశా లపై ఆయన కొనసాగిస్తున్న కృషి దేశసేవ పట్ల ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనమన్నారు. కోవింద్ చిన్ననాటి విషాదాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని మోదీ భావోద్వేగానికి గురయ్యారు.

బాల్యంలో వారి ఇల్లు అగ్నిప్రమాదానికి గురైనప్పుడు వస్తువులను కాపాడేందుకు ప్రయత్నించిన కోవింద్ తల్లి ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ప్రస్తావించారు. కోవింద్ ఆత్మకథ శీర్షిక ఎంతో అద్భుతంగా ఉందని, ఆయన జీవితంలో ఎదుర్కొన్న పోరాటాలు వ్యక్తిగతమైనవి అయినప్పటికీ.. వాటి ద్వారా సాధించిన విజయం మాత్రం భారత ప్రజాస్వామ్యానిదే నని అభివర్ణించారు.