13 August, 2026 | 1:52 AM

దసరాలోపు రాజిరెడ్డి కారిడార్ పనులు పూర్తయ్యేనా?

13-08-2026 12:07 AM

2018లో పనులు ప్రారంభం 

ఆగుతూ సాగుతూ నిర్మాణం 

నరకం అనుభవిస్తున్న ప్రజలు 

పనులు పూర్తయితే రవాణా సౌకర్యం మెరుగు 

మేడ్చల్, ఆగస్టు 12 (విజయక్రాంతి): ఉప్పల్ నారపల్లి మధ్య నిర్మిస్తున్న రాజిరెడ్డి కారిడార్ పనులు దసరాలోపు పూర్తవుతాయా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పనులు పూర్తిచేసి దసరాకు అందుబాటులోకి తీసుకొస్తామని గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. అంతేగాక తాజాగా మంగళవారం జాతీయ రహదారుల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి దసరా వరకు పనులు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.

గతంలో మాట ఇచ్చినందున ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కానీ పనుల తీరు చూస్తే దసరా వరకు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. మొన్నటి వరకు పనులు చకా చకా జరిగినప్పటికీ ప్రస్తుతం కాస్త నెమ్మదించాయి. మేజర్ పనులు పూర్తయినప్పటికీ ఇంకా మూడు పిల్లర్ల నిర్మాణం జరుగుతోంది. దీనితోపాటు ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద పనులు చేయాల్సి ఉంది. 

2018లో పనులు ప్రారంభం 

వరంగల్ రహదారిలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ఉప్పల్ నారపల్లి మధ్య (రాజిరెడ్డి కారిడార్) ఫ్లైఓవర్ పనులు 2018లో ప్రారంభించారు. పనులు కొన్ని రోజులు సాగడం మరికొన్ని రోజులు బంద్ ఉండడం వల్ల నిర్ణీత సమయంలో పూర్తికాలేదు. పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ జామ్ కావడమే గాక రోడ్డుపై గుంతలు, దుమ్ము, ధూళితో వాహనదారులతోపాటు ప్రయాణికులు, రోడ్డు పక్కన ఉన్న దుకాణదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.

ఈ సమస్య పరిష్కారానికి రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్ తమ వంతు ప్రయత్నాలు చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెండుసార్లు వచ్చి క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించారు. తాజాగా సమీక్ష సమావేశం నిర్వహించి దసరా లోపు కచ్చితంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మరోవైపు ఎంపీ ఈటెల రాజేందర్ సైతం గతంలో ఫ్లైఓవర్ పనులు పరిశీలించారు. పనులు నిలిచిపోవడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి కి విన్నవించారు.

6.25 కిలోమీటర్ల పొడవు 

ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ పొడవు 6.25 కిలోమీటర్లు. దీని అంచనా వ్యయం రూ.626 కోట్లు. ఆరు లేన్ లుగా నిర్మించాలని నిర్ణయించారు. పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. నారపల్లి సిపిఆర్‌ఐ నుంచి బోడుప్పల్, మేడిపల్లి వరకు పిల్లర్లపై గిడ్డర్లు అమర్చడం పూర్తయింది.4.5 కిలోమీటర్లు పూర్తికాగా 1.75 కిలోమీటర్లు పూర్తి చేయాల్సి ఉంది. 143 పిల్లర్లతో ఈ కారుడారు నిర్మిస్తున్నారు. ఇందులో 140 పిల్లర్ల నిర్మాణం పూర్తికాగా, మూడు పిల్లర్ల పనులు జరుగుతున్నాయి. ఉప్పల్ చౌరస్తాలో స్కైవాక్, మెట్రో లైన్ ఉన్నందున అక్కడ పనులు క్లిష్టంగా మారింది. ఆ రెండింటి మీద పనులు పూర్తి చేయడం పెద్ద సమస్యగా తయారైంది. 

కారిడార్ పూర్తయితే రవాణా సౌకర్యం మెరుగు 

రాజిరెడ్డి కారిడార్ పనులు పూర్తయితే ఉప్పల్ మేడ్చల్ నియోజకవర్గాలతో పాటు  తెలంగాణ లోని పలు జిల్లాలకు రవాణా సౌకర్యం మెరుగవుతుంది. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి ఈ రహదారి గుండానే వెళుతుంటారు. వరంగల్, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు, భువనగిరి తదితర జిల్లాల వారు కూడా వెళుతుంటారు.

ఈ రహదారిపై వాహనాల రద్దీ బాగా ఉంటుంది. దూర ప్రాంతాల వాహనాలతో పాటు ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లి, పీర్జాదిగూడ, ఘట్కేసర్ ప్రాంతాల వాహనాలతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతుంటాయి. ఈ కారిడార్ పనులు పూర్తయితే దూరప్రాంతాలకు వెళ్లే వాహనాలు ఫ్లై ఓవర్ మీదుగా నేరుగా వెళ్లే అవకాశం ఉంటుంది. పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గుతాయి.