13 August, 2026 | 3:51 AM

ఎగవేతను సహించం

13-08-2026 01:22 AM

బ్లాక్‌మెయిల్ చేయాలని చూస్తే ఊరుకునేది లేదు

మిల్లుల నుంచి బకాయిలు వసూలు చేయాలి

  1. డిఫాల్ట్ మిల్లులను స్వాధీనం చేసుకోవాలి 
  2. బకాయిల వసూలుకు విధి విధానాలు రూపకల్పన చేయాలి 
  3. ధాన్యం నిల్వలకు 5 నియోజకవర్గాల్లో భారీ గోదాములు 
  4. పౌరసరఫరాల శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 
  5. హాజరైన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): తెలంగాణలో రైస్ మిల్లర్ల గోల్ మాల్ వ్యవహారాలు, పెండింగ్ బకాయిలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర అగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేయాలని చూస్తే ఏమాత్రం సహించేదిలేదని సీఎం హెచ్చరించారు. మిల్లర్లు బకాయి పడిన ధాన్యం విలువకు సంబంధించిన మొత్తాన్ని వసూలుచేయాల్సిందేనని అధికారులను ఆదేశించారు.

వ్యాపార దృక్పథం తో మిల్లులు నడిపే వారితో సానుకూలంగా ఉంటామని, ఉద్దేశపూర్వకంగా ఎగవేతలకు ప్రయత్నించే వారితో కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు.  బుధవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి పౌరసరఫ రాల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఉద్దేశపూర్వకంగా డీఫాల్ట్ అయి ప్రభుత్వ బకా యిలు చెల్లించని రైస్ మిల్లులను స్వాధీనం చేసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.

స్వాధీనం చేసుకున్న మిల్లులను.. అవసరమైతే మిల్లింగ్ బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలన్నారు. గత ప్రభుత్వం రూ. వేల కోట్ల బకా యిలకు అవకాశం ఇచ్చి.. తిరిగి ఆ తప్పిదాన్ని తమ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయ త్నం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికే బకాయిల వసూలులో కొంత పురోగతి ఉందని, అయితే ప్రతి ధాన్యం గింజకు చెందిన బకాయిని వసూ లు చేయాల్సిందేనన్నారు.

బకాయిల వసూలుకు సంబంధించి విధివిధానాలను పక్కా గా రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. విధివిధానాల రూపకల్పన పూర్తయిన తర్వాత ఆ నివేదికను మంత్రివర్గ ఉప సంఘానికి సమర్పిం చాలని సీఎం సూచించారు. మంత్రివర్గ ఉప సంఘం పరిశీలన అనంతరం ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందన్నారు. మొండి బకాయిదారులుగా మారిన మిల్లర్లకు కేటాయించే ధాన్యాన్ని మహిళా సంఘాలకు కేటాయించి మిల్లింగ్ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 

ప్రతి సీజన్‌లో ధాన్యం నిల్వకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఇప్పటినుంచే తగు కార్యాచరణ రూపొందించాలని సీఎం అధికారులకు సూచించా రు. ధాన్యం భారీగా వచ్చే నల్లగొండ, సూర్యాపేట, నిజామాబాద్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద ఐదు భారీ గోదాంలను నిర్మించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) ఆధ్వర్యంలో ఇందుకోసం నియోజకవర్గానికి 50 నుంచి 100 ఎకరాల భూమి ని కేటాయిస్తామని సీఎం తెలియజేశారు.

వీటి నిర్మాణానికి సంబంధించి రెవెన్యూ, పౌరసరఫరాలు, మహిళా సంక్షేమ శాఖల మంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీబీ జీ రామ్ జీలో ఫ్లాట్‌ఫాంల నిర్మాణానికి అవకాశం ఉన్నందున, విశాలమైన ఫ్లాట్‌ఫాంలు నిర్మించి జర్మన్ టెంట్లతో ధాన్యం నిల్వకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం సూచించారు.

మండల, గ్రామ స్థాయిలో ఉన్న ప్రైవేటు గోదాములు, ధాన్యం నిల్వకు ఉపయోపపడే కల్యాణ మండపాలు, పాత థియేటర్లు, ఇతర షెడ్లను ముందుగానే గుర్తించి ధాన్యం నిల్వకు లీజుకు తీసుకోవాలని, ప్రణాళికాబద్ధ్దంగా పర్యవేక్షించేందుకు ప్రతీ జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమించాలని తెలిపారు. ఈ సమీక్షలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వీ శేషాద్రి, పౌరసరఫరాల సంస్థ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, సౌత్ ఇండియా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తూడి దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.