చదువుకుంటే రాజ్యాంగం తెలిసేది!

29-04-2024 12:13:48 AM

l అంబేడ్కర్ మళ్ళీ పుట్టినా రాజ్యాంగాన్ని మార్చలేం 

l సవరణ మాత్రమే చేయగలం

l కాంగ్రెస్ 106 మార్లు సవరించింది

l సీఎం తప్పుడు ప్రచారం మానుకోవాలి

l రేవంత్‌రెడ్డిపై రఘునందన్ విమర్శలు

మెదక్, ఏప్రిల్ 28(విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి చదువుకుంటే రాజ్యాంగం గురించి తెలిసేదని మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ సర్జికల్ స్ట్రుక్ చేస్తుందని, మోదీ గెలిస్తే రాజ్యాంగం మారుస్తాడని రేవంత్ తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మళ్ళీ పుట్టినా రాజ్యాంగాన్ని మార్చడం సాధ్యం కాదని స్వయంగా మోదీ చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. మెదక్‌లో ఆదివారం మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని ఎవరూ మార్చలేరని తెలిపారు. రాజ్యాంగానికి సవరణ మాత్రమే చేస్తారని, కాంగ్రెస్ పాలనలో ఇప్పటివరకు 106 సార్లు సవరించినట్లు చెప్పారు.

చర్చకు సీఎం సిద్ధమా ?

రాజ్యాంగ సవరణపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని, సీఎం రేవంత్‌రెడ్డి ఇందుకు రెడీనా అని రఘునందన్‌రావు సవాల్ చేశారు. ఎన్నికల బరిలో నిలిచిన అంబేడ్కర్‌ను ఓడించింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. లిక్కర్ కేసులో కవిత బెయిల్ కోసం బీజేపీ, బీఆర్‌ఎస్ సీట్లు పంచుకున్నాయని రేవంత్‌రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. కవితను అరెస్టు చేయకుంటే చేయలేదని, చేస్తే బెయిల్ కోసం లోపాయికారి ఒప్పందమంటూ ఆరోపించడం సిగ్గు చేటన్నారు. కేసీఆర్ లక్షల కోట్లు కొల్లగొట్టారని, రికవరీ చేసి పేదలకు పంచుతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీతో చెప్పించారని గుర్తు చేశారు. ఆ డబ్బును ఎంతమందికి పంచారో సీఎం చెప్పాలని ప్రశ్నించారు. దేశంలో ఎమర్జెన్సీ తెచ్చి ప్రజలను, మీడియాను అణచివేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అన్నారు. ఆర్టికల్ 370ను రద్దు చేస్తామని చెప్పి చేసి చూపించామని, ఈబీసీలకు రిజర్వేషన్లను మోడీ ప్రభుత్వమే కల్పించిందన్నారు. 

జైశ్రీరాం అంటేనే తిరగనివ్వాలి...

జైశ్రీరాం అంటే కడుపు నిండుతుందా అని మాజీ సీఎం కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ అంటున్నారని, ఇదే మాట ముస్లిం, ఆదివారం ప్రార్థన మందిరాల వద్ద చెప్పగలరా? అని నిలదీశారు. ఈ ఎన్నికల్లో జైశ్రీరాం అంటేనే కేసీఆర్‌ను, కేటీఆర్‌ను గ్రామాల్లో తిరగనీయాలని ప్రజలకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, నాయకులు ప్రసాద్, విజయ్, మధు పాల్గొన్నారు.