20 April, 2026 | 1:30 PM

ఉపాధి కూలీలకు వసతులు కరువు

29-04-2024 12:14 AM

హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): పల్లెల్లో కూలీల వలసలను నివారించడంతో పాటు వారికి పని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రారంభంలో దశలవారీగా కూలీలకు గడ్డపారలు, మెడికల్ కిట్లు, టెంట్లు, తాగు నీటి వసతులు కల్పించారు. ఒకవేళ సొంత గడ్డపార సమకూర్చుకుంటే రోజుకు రూ.10, తాగునీటి కోసం రూ.5 అందచేసేవారు. కానీ, నెమ్మదిగా వీటిని తగ్గిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఎటువంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో మినహా ఉపాధి కూలీలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు.

ప్రస్తుతం వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 40 నుంచి 45 డిగ్రీలు నమోదు అవుతుండగా... ఉపాధి హామీ కూలీలు అస్వస్థతకు గురవుతున్నారు. మరికొంత మంది ప్రాణాలను కోల్పోతున్నారు. వాస్తవానికి వేసవిలో మార్చి నుంచి జూన్ వరకు వారికి వడదెబ్బ తగలకుండా టెంట్లు వేసి రక్షణ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. కానీ, అధికారులు పట్టించుకోకపోవడంతో చెట్ల నీడ కింద విశ్రాంతి తీసుకోవాల్సి వస్తోంది. కనీసం తాగునీటిని అందించటంలోనూ నిర్లక్ష్యం వహించడంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా అధికారులు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.