కల్తీ విత్తనాలపై నిఘా
అక్రమంగా అమ్మకాలు చేసిన 12 మందిపై కేసులు
హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): వానాకాలం ఆరంభయ్యే క్రమంలో నకిలీ విత్తనాల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులు సూచించారు. ఈ మేరకు పోలీసులు, విజిలెన్స్ శాఖను అప్రమత్తం చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మన రాష్ట్రానికి విత్తనాలను సరఫరా చేస్తున్న వారిపై తనిఖీలు చేట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. లైసెన్స్ లేకుండా నిషేధిత పత్తి, ఇతర విత్తనాలను రైతులకు మభ్యపెట్టి అమ్మకాలు చేసే వారిపై గట్టి నిఘా పెట్టారు.
ఈ క్రమంలో పలు జిల్లాలో పోలీసు, విజిలెన్స్ వ్యవసాయశాఖ అనుమతిలేని విత్తనాలు అమ్మిన 12 మందిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. సరిహద్దు రాష్ట్రాల్లో తనిఖీ బృందాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించే దిశగా అన్ని చర్యలు చేపట్టిందని, లైసెన్స్ పొందిన విత్తన డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని సూచించింది. తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని, తీసుకున్న రశీదు పంట కోతలు పూర్తయ్యే వరకు భద్రపరుచుకోవాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ సూచించారు.






