నాకు రావలసిన గుర్తింపు రాలేదు !

01-05-2024 12:25:00 AM

ఇలియానా... తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన పేరిది. దేవదాసు, పోకిరి, రాఖి, కిక్, జులాయి వంటి విజయవంతమైన చిత్రాలతో కుర్రకారు హృదయాల్లో చెరగని ముద్ర వేశారు ఈ ముద్దుగుమ్మ. ఒకప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా కొనసాగిన ఇలియానా కెరీర్‌కు ఇప్పుడు కాస్త బ్రేక్ పడింది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను నటించిన ఓ హిందీ సినిమా కారణంగా దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయన్నారు. ‘సౌత్ ఇండియా సినిమాలతో నేను బిజీగా వున్న సమయంలో 2012లో అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కిన ‘బర్ఫీ’ చిత్రంలో అవకాశం వచ్చింది. కథ కూడా నాకు బాగా నచ్చడంతో  ఆ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించాను.

అలాంటి చిత్రాల్లో నటించే అవకాశాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అటువంటివి వచ్చినపుడు వదులుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నటించాను. అనుకున్నట్లుగానే సినిమా విజయవంతమైంది. అయితే ఇక అందరూ నేను సౌత్ సినిమాలు వదిలేసి బాలీవుడ్‌కు వెళ్లిపోయానని అనుకున్నారు. ఇక సౌత్ సినిమాల్లో నటించనని కొంతమంది ప్రచారం కూడా చేశారు. ఆ అపోహతోనే దర్శక, నిర్మాతలు నన్ను సంప్రందించలేదు. అయితే నేను బాలీవుడ్‌లో కూడా చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేశాను. నా సినిమాల ఎంపిక విధానంలో మార్పు వచ్చింది. నాకు మొదట్నుంచీ ఏ పనిచేసినా నిజాయితీగా చేయడం అలవాటు. నాకు ఎటువంటి పాత్ర ఇచ్చినా ఆ పాత్రకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. కానీ సినీ పరిశ్రమకు వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. నాకు రావలసిన గుర్తింపు, స్థాయి రాలేదనిపిస్తుంది. దానికి ఇది కారణం అని కూడా చెప్పలేను’ అని చెప్పుకొచ్చారు.