‘రౌడీ’ పాన్ ఇండియా సినిమా టైటిల్ ఇదేనా?

01-05-2024 12:25:00 AM

ఫలితంతో నిమిత్తం లేకండా సినిమాల్లో వేగం పెంచారు యువ హీరో విజయ్ దేవరకొండ. తనకు నచ్చిన కథలతో తర్వాతి చిత్రాలకు సిద్ధమవుతున్నారు. ఇటీవల ‘ఫ్యామిలీ స్టార్’గా తెరమీదికొచ్చిన విజయ్, ప్రస్తుతం దర్శకుడు గౌతమ్ తిన్ననూరి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే కోవలో తర్వాతి సినిమాల కోసం గ్రీన్ సిగ్నల్  ఇచ్చిన విజయ్, గౌతమ్ సినిమా పూర్తి కాగానే రవికిరణ్ కోల దర్శకత్వంలో నటించనున్నారు. దర్శకుడిగా తొలి చిత్రమైన ‘రాజావారు రాణివారు’ విజయం సాధించినప్పటికీ రవి కిరణ్ నుండి నేటి వరకు మరో సినిమా వచ్చింది లేదు.

మధ్యలో విశ్వక్ సేన్ నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రానికి కథ అందించిన ఆయన రెండో సినిమా ప్రకటనకై వేచి చూస్తున్నారు. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నట్టు సమాచారం. ‘ఫ్యామిలీ స్టార్’  సినిమా ప్రచార కార్యక్రమాల్లో విజయ్‌తో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నామని, ఆ కథపై కొంత కాలంగా పని చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు దిల్ రాజు. అది రవికిరణ్ రాసుకున్నదని తెలుస్తోంది. కాగా ఈ సినిమాకి ‘రౌడీ జనార్దన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట దర్శకనిర్మాతలు. అసలే ‘రౌడీ’గా మం చి గుర్తింపు వుంది విజయ్‌కి. అదే సినిమా టైటిల్‌గా మారితే సినిమాపై అంచనాలు వేరే స్థాయికి చేరతాయనటంలో ఎలాంటి సందేహం లేదు.