గ్రామ సమైక్యలలో అక్రమ వసూళ్లు
ప్రైవేట్ ఎల్‌ఐసీల దందా ముగింపు జరిగేనా విజయక్రాంతి కథనానికి స్పందన
విచారణ చేస్తున్నాం : ఏపీఎం
చిన్న చింతకుంట మే 26: మహిళా సంఘాల సభ్యులకు అందించే రుణాలలో బుక్ కీపర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారని కొంతమంది మహిళా సంఘాల సభ్యులు సిసికి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పూర్తి వివరాలతో విజయక్రాంతి దినపత్రిక లో మంగళవారం ’మహిళా సంఘాలలో కమిషన్ దందా’అనే కథనం ప్రచురితం చేసింది.
ఈ కథనంపై ఏపిఎం బుక్ కిపర్ల ను మహిళా సమైక్య కార్యాలయానికి పిలిచి విచారణ చేపట్టారు. అదనంగా వసూలు చేసిన డబ్బులకు సంబంధించి విచారణ చేపట్టి ఏ మహిళా సంఘం సభ్యులతో ఎంత తీసుకున్నారని వివరాలు సేకరిస్తున్నారు.
చేతివాటంలో మరో కోణం..
బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు, గ్రామ సంఘాలలో లోన్లు ఇప్పించినందుకు గాను రూ. 1,000 వరకు వసూలు చేస్తున్నారని, అలాగే ప్రైవేట్ ఎల్‌ఐసీలు చేయిస్తూ సభ్యులపై ఒత్తిడి తెస్తున్నారని విచారణలో తేలింది. అంతేకాకుండా నియమ నిబంధనలకు విరుద్ధంగా రూ. 500 నుండి రూ. 1,500 వరకు భారీగా ఫైన్లు (జరిమానాలు) విధిస్తున్నట్లు సభ్యులు ఆరోపించారు.
ఓ బుక్ కీపర్ మహిళా సంఘం సభ్యులతో సభ్యురాలికి సంబంధించిన రూ. 10 వేల అకౌంట్ తప్పుగా సర్దుబాటుఅయ్యిందని, మొత్తం రూ. 80 వేల నిధులు స్త్రీనిధి అకౌంట్కు బదిలీ అయ్యాయని విచారణలో గుర్తించారు. దీనిపై శనివారం లోపు రికవరీ చేసి ఇస్తామని గ్రామ సంఘం ప్రతినిధులు తెలిపినట్టు ఏపీఎం పేర్కొన్నారు. సాధారణంగా రూ. 50 నుండి రూ. 100 వరకు ఉండాల్సిన ఫైన్లు, ఒక గ్రూపులో రూ. 920 వరకు వసూలు చేసినట్లు తేలింది.
దీనిపై పూర్తి రికార్డులను, మినిట్స్ బుక్స్ను తనిఖీ చేయనున్నట్లు ఏపీఎం తెలిపారు. మహిళా సంఘాల సభ్యులపై ఎలాంటి ప్రైవేట్ ఎల్‌ఐసీల కొరకు ఒత్తిడి చేయవద్దని బుక్ కీపర్లను హెచ్చరించారు. మహిళా సంఘాల సభ్యులు ఎంతో కష్టపడి అప్పులు కడుతుంటారు. వారిపై ఇలాంటి అక్రమ వసూళ్లకు పాల్పడితే సహించేది లేదు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే ఉద్యోగాల నుండి తొలగిస్తామని హెచ్చరించారు.
సమగ్ర విచారణ చేస్తేనే సభ్యులకు మేలు..
సంబంధిత అధికార యంత్రం సమగ్ర విచారణ చేసి గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహిళా సంఘాల సభ్యుల ఎదుగుదల కోసం ఏర్పాటుచేసిన మహిళా సమైక్య గాడి తప్పితే అది సరి చేయాల్సిన బాధ్యత కూడా వారిపై ఉంది. అధికారుల పర్యవేక్షణ నామమేత్రంగా ఉండడంతోనే ఈ తప్పులకు తావు ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికైనా పూర్తిస్థాయిలో విచారణ చేసి సభ్యుల ఎదుగుదలకు తోడ్పాటు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతుండ్రు.
విచారణ చేస్తున్నాం..
పూర్తిస్థాయిలో విచారణ చేయడం జరుగుతుంది. బుధవారం కూడా విచారణ చేస్తాం. ఇప్పటికే కొన్ని విషయాలు మా దృష్టికి వచ్చాయి సరిచేయాలని ఆదేశించడం జరిగింది. తప్పు చేసినవారిని పై శాఖ పరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదు.
- ఏపీఎం నాగమణి, చిన్న చింత కుంట






