అటవీ భూమికి అక్రమంగా పట్టాలు!
- అటవీ శాఖ అధికారుల సహకారం?
- సూరారంలో ఆలస్యంగా వెలుగులోకి
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 1 (విజయక్రాంతి): అటవీ భూములను రక్షిం చాల్సిన ఫారెస్టు అధికాలు.. అటవీ భూమిని అక్రమంగా నరికించి, నిప్పుపెట్టి, చదును చేసి, దగ్గరుండి పట్టాలు ఇప్పించిన వైనం కొత్తగూడెం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు 3 హెక్టార్ల రిజర్వు ఫారెస్టు ప్లాంటేషన్ భూమి అన్యాక్రాంతమైందనే ఆరోపణలు వెలువుడు తున్నాయి.
కొత్త గూడెం జిల్లా పాల్వంచ ఫారెస్టు డివిజన్ పరిధిలోని పాల్వంచ రేంజ్‌లోని సూరారం బీట్ లో ఈ అక్రమాలు చోటు చేసుకొన్నాయి. 2014లో రిజర్వు ఫారెస్టు భూమి 10 హెక్టార్లలో(సుమారు 25ఎకరాలు) జామాయిల్ ప్లాంటేషన్ వేశారు. ప్రస్తుతం ఆ జామాయిల్ కోత దశలో ఉంది. అయితే 2020 2021లో కొంతమంది ఫారెస్టు అధికారులు డిప్యూటేషన్‌పై సూరారం బీట్‌కు వచ్చారు.
అప్పటి వరకు చక్కగా ఉన్న ప్లాంటేషన్ ఆ తర్వాత ఆక్రమణలు చోటు చేసుకొన్నాయి. డిప్యూటేషన్‌పై వచ్చిన ఫారెస్టు అధికారులకు స్థానికంగా ఉన్న కొందరు చేతులు కలిపి జామాయిల్ చెట్లను నరికించి, కాల్చి, చదునుచేసి అక్రమంగా 49మంది గిరిజనులకు ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలు ఇప్పించినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. వారి నుం చి అక్రమార్కులు డబ్బులు దండుకున్నట్టు తెలుస్తోంది.
2020 సంవత్సరంలోనే అటవీ భూమి అన్యాక్రాంతమైందని స్థానికులు ఆరోపించారు. కాగా 10 హెక్టార్లు ఉం డాల్సిన జామాయిల్ తోట ప్రస్తుతం కేవలం 7 హెక్టార్లు మాత్రమే ఉన్నదని తెలుస్తోంది. కార్యాలయాల్లో ప్లాంటేషన్‌కు సంబంధించిన రికార్డులను సైతం మాయం చేశారని ఆరోపణలు వస్తున్నాయి.
ఇప్పటికైనా అటవీ శాఖ ఉన్నతాధికారులు సూరారం బీట్‌లోని జమాయిల్ ప్లాంటేషన్ అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని, అన్యాక్రాం తమైన రిజర్వు ఫారెస్ట భూమిని స్వాధీనం చేసుకోవాలని, అక్రమాలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థాని క గిరిజనులు కోరుతున్నారు.




