09-01-2026 12:00:00 AM
సహజ వనరులు కనుమరుగు.. పట్టించుకోని అధికారులు
తూప్రాన్, జనవరి 8: సహజ వనరులు కనుమరుగవుతున్న ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడం పలు విమర్శలకు దారితీస్తుంది. అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిలో మట్టిని అక్రమంగా తవ్వడంతో గుట్టలు మాయమవుతున్నాయి. తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని 213 సర్వే నెంబర్ లో (టాటా కాఫీ వెనక భాగం, డంపు యార్డు సమీపంలో) వ్యాపారులు మట్టిని తవ్వి విక్రయించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.
ఇదంతా అధికారుల కనుసన్నల్లో జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారులు మట్టి వ్యాపారుల మామూళ్లకు తలొగ్గి అటువైపు చూడటం లేదని స్థానిక రైతులు మండిపడుతున్నారు. వార్తా కథనాలు ప్రచురితమైతే అధికారులకు అవకాశం మరింత కలిసొస్తుందని, వాహనాలను సీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన అధికారులు చర్యలు చేపట్టకుండానే వాహనాలను వదిలేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు.
రాళ్లతో వ్యాపారం...
గుట్ట చుట్టూ ఉన్న మట్టిని తవ్వడంతో పెద్దపెద్ద రాళ్లను కనీలు, గనేటుగా తయారు చేసుకొని వ్యాపారం సాగిస్తున్నారు. ప్రభుత్వ భూమిలో మట్టి తరలించాలన్న బండరాళ్లను తొలగించాలన్న రెవెన్యూ, మైనింగ్ శాఖల అనుమతులు అవసరం. కానీ ఆ రెండు శాఖల అధికారులకు, వ్యాపారులకు మధ్య ఉన్న లోపాయికారి ఒప్పందంతో ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి వ్యాపారులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.