14 April, 2026 | 2:46 AM

నాడు అక్రమం.. నేడు సక్రమం

28-06-2024 01:40 AM
  1. ఆదిబట్ల మున్సిపాలిటీలో ఇటీవల అక్రమ నిర్మాణాలు కూల్చివేత
  2. 20 రోజుల తర్వాత మళ్లీ మొదలైన కూల్చిన భవనాల పనులు
  3. నోటీసులు ఇచ్చి సెటిల్‌మెంట్ చేసుకుంటున్నారని స్థానికుల ఆరోపణ

ఇబ్రహీంపట్నం, జూన్ 2౭: రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలు దర్జాగా సాగుతున్నాయి. పలువురు అధికారుల చేతులు తడిపితే చాలు ఎన్ని అంతస్థులైనా నిర్మించుకోవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల బహుళ అంతస్తుల అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని వచ్చిన ఫిర్యాదులతో ఉన్నతాధికారుల జోక్యం చేసుకొని నోటీసులు ఇచ్చిన నిర్మాణాలను గత నెల 24న మున్సిపల్ కమిషనర్, టీపీవోలు సిబ్బందితో కలిసి కూల్చేశారు.

తీరా చూస్తే 20 రోజుల తర్వాత అక్కడ మళ్లీ నిర్మాణ పనులు మొదలవడంతో స్థానికుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. నాడు అక్రమం అని అధికారులు కూల్చి వేయగా, నేడు కూల్చిన నిర్మాణాల్లో తిరిగి పనులు జరుగుతుండడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు అక్రమమైనవి, ఇప్పుడు సక్రమమెలా అయ్యాయో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. అధికారుల అండదండలతోనే పనులు కొనసాగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.  

అధికారుల మౌనం..

అక్రమ నిర్మాణాల గురించి అధికారులకు తెలిసినా మౌనంగా ఉంటున్నారా ? లేక తెలియక వదిలేస్తున్నారా అనేది ప్రశ్నార్థకంగా ఉన్నప్పటికీ.. నిర్మాణదారులు మాత్రం తీసుకునే అనుమతులు, చేపట్టే నిర్మాణాలకు ఎక్కడ పొంతన లేకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు ఇచ్చి హడావుడి చేశాక, నిర్మాణదారులు, అధికారులు కలిసిన తర్వాత అక్కడ సీన్ మొత్తం రివర్స్ అవు తుందని, డబ్బులు తీసుకున్న తర్వాత అధికారులు మౌనంగా ఉండిపోతున్నారని ఆరో పణలు వినిపిస్తున్నాయి. ఆదిబట్ల మున్సిపాలిటీలో అధికారులు నోటీసులు ఇచ్చారంటే అది సెటిల్‌మెంట్లకు సూచిక అన్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఆరోపణలపై వివరణకు దూరంగా..

మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలపై వస్తున్న ఆరోపణలపై కమిషనర్, టౌన్‌ప్లానింగ్ అధికారుల వివరణ కోసం సంప్రదించగా వారు అందుబాటులోకి రావడం లేదు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారులు సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.