6 March, 2026 | 3:09 AM

రేషన్ బియ్యం అక్రమ దందా

06-03-2026 01:23 AM

లబ్ధిదారులకు నగదు.. మిల్లులకు బియ్యం తరలింపు. 

మిల్లర్లకు క్లీన్ చిట్ ఇచ్చేస్తున్న అధికారులు

కల్వకుర్తి మార్చి 5: జిల్లాలో రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీతో రేషన్ డీలర్ల అక్రమ దందా శృతిమించుతోంది. రేషన్ షాపుల నుంచి లబ్ధిదారులకు బియ్యం ఇవ్వకుండా కొందరు డీలర్లు కిలోకు రూ.20 చొప్పున నగదు చెల్లించి బియ్యాన్ని తిరిగి సేకరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ, కొందరు డీలర్లు రైస్ మిల్లర్లు కలిసి అక్రమ దందాను కొనసాగిస్తున్నారని అందుకు అధికారులంతా సంపూర్ణ సహకారం అందిస్తున్నారని విమర్శలు వ్యక్తమవు తున్నాయి.

ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యం నాణ్యతగా లేవంటూ లబ్ధిదారులను ఆందోళనకు గురి చేస్తూ బియ్యం తీసుకోకుండా కిలోకు రూ.20 నగదు ఇస్తూ పెద్ద ఎ త్తున బియ్యాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. సేకరించిన బియ్యాన్ని షాప్ లో నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు పట్టపగలే మిల్లులకు తరలిస్తున్నారని బాహాటంగా విమర్శలు ఉన్నాయి. మిల్లర్లు కిలోకు  రూ.28 నుంచి 30 వరకు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. మిల్లర్లు ఆ బియ్యాన్ని మళ్లీ ప్రభుత్వానికి సరఫరా చేస్తూ క్లిలో బియ్యంపై  సుమారు రూ.12 నుంచి రూ.15 వరకు లాభం పొందుతున్నట్లు చెబుతున్నారు.

 అధికారులదే అండ దండ..!

 జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాల వద్ద బియ్యం పంపిణీ చేస్తున్న క్రమంలో లబ్ధిదారుల వద్ద బీరసారాలు నడుస్తూనే ఉన్నాయి. కేవలం వేలిముద్ర నమోదు చేసి డబ్బులు ఫోన్ పే లేదా నగదు లావాదేవీలు అక్కడికక్కడే జరుగుతున్నాయి. ఉన్నతాధికారులు తక్షణం రేషన్ దుకాణాలను తనిఖీ చేస్తే స్టాక్ వివరాలు హెచ్చుతగ్గులు కనిపిస్తాయి కానీ లబ్ధిదారుల నుండి తీసుకున్న బియ్యం దుకాణాల్లో ఉన్న స్టాక్ సాయంత్రానికి ఆటోల ద్వారా తరలించి గోడౌన్లో భద్రపరుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు ఉన్నతాధికారులకు స్థానికులు ఫిర్యాదు చేసిన తమకేమీ సం బంధం లేదన్నట్లు పట్టించుకోవడంలేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.

రైతుల పండించిన ధాన్యాన్ని ఐకెపి పిఎసిఎస్ మెప్మా ద్వారా ఆయా రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించగా అట్టి ధాన్యాన్ని తిరిగి బియ్యం ఇంకా మార్చి ప్రభుత్వానికి పంపిణీ చేయాల్సి ఉంది కానీ జిల్లాలో చాలావరకు బ్లాక్ లిస్టులో ఉన్న రైస్ మిల్లర్స్ తెర వెనుక ఈ దందా కొనసాగిస్తూ పెండింగ్ క్లియర్ చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బ్లాక్లిస్టులో ఉన్న రైస్ మిల్లర్స్ పై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నప్పటికీ నాగర్ కర్నూల్ జిల్లాలో మాత్రం ఉన్నతాధికారులు ముడుపులకు ఆశపడి రైస్ మిల్లర్స్ ను కాపాడుతున్నట్లు బాహాటంగా చర్చ జరుగుతుంది.

నాగర్కర్నూల్ జిల్లాలో ప్రతి నెల సుమారు 5,000 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సరఫరా అవుతోంది. జిల్లాలో మొత్తం 2,75,900కు పైగా రేషన్ కార్డులు ఉండగా, సుమారు 8 లక్షల 87 వేల 311 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి 552 రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ జరుగుతోంది. అయితే ఈ బియ్యంలో సగం కూడా లబ్ధిదారుల ఇళ్లకు చేరడం లేదని ఆ రోపణలు వినిపిస్తున్నాయి.ప్రధానంగా కల్వకుర్తి ప్రాంతంలో దశాబ్దాలుగా బియ్యం వ్యా పారంలో ఉన్న కొందరు మిల్లులు నడిపిస్తూ ఈ అక్రమ దందాను గుట్టుచప్పుడు కాకుం డా కొనసాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

అధికారులు అప్పుడప్పుడు తనిఖీలు చేస్తున్నప్పటికీ పెద్దగా చర్యలు లేకపోవడంతో అక్రమ వ్యాపారం  అధికారుల అండ తోనే జోరుగా సాగుతుందన్న వాదన వినిపిస్తోంది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయాలన్న లక్ష్యానికి తూట్లు పడుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.   ఇప్పటికైనా సంబంధిత అధికా రులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.