25 February, 2026 | 3:01 AM

ప్రజల నుంచి వచ్చే అర్జీలు పరిష్కారం దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలి

25-02-2026 01:17 AM

రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

వనపర్తి, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): ప్రజల నుండి వచ్చే అర్జీలు, ఫిర్యాదులకు అధికారులు సరైన సమాధానం ఇవ్వడంతో పాటు పరిష్కారం దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కొల్లాపూర్ నియోజకవర్గం, పానగల్ మండలాలకు సంబందించిన రెవెన్యూ, గృహ నిర్మాణం, శాఖలపై జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.

సమీక్షలో భాగంగా రెవెన్యూ, హౌసింగ్ మరియు ఇతర శాఖలకు సంబంధించిన ప్రజా సమస్యలను మంత్రి కలెక్టర్ సమక్షంలో అధికారులతో చర్చించారు. పాన్గల్ మండలం తెల్ల రాళ్లపల్లి గ్రామంలో సర్వేనెంబర్ 11లో ఓ రైతుకు చెందిన భూమి పొరపాటున గతంలో అటవీ భూమిగా నమోదయిందని దరఖాస్తు చేసుకున్నారని, ఆయన సమస్య పరిష్కారం కాకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. వెంటనే సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకుని పది రోజుల్లో సమస్య పూర్తయినట్లుగా తనకు తెలియజేయాలని ఆదేశించారు.

అదేవిధంగా దావాజ్ పల్లి తండా, కిష్టాపూర్ కు సంబంధించిన పలువురు రైతులు తమ పోడు భూ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వీటిపై అధికారులను ఆరా తీసిన మంత్రి వెంటనే ఆయా రైతుల సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా పానగల్ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో రెవెన్యూ శాఖ పరిధిలో భూములకు సంబంధించిన అంశాలన్నింటినీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పరిష్కారం చేయాలని కలెక్టర్ కు సూచించారు.

ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఇల్లు మంజూరు అయ్యి ఇంకా నిర్మాణం ప్రారంభించుకొని వారందరినీ గుర్తించి సమావేశం నిర్వహించాలని సూచించారు. వారంతా నిర్మాణాలు ప్రారంభించుకోకపోవడానికి గల కారణాలను తెలుసుకుని వేగంగా వారందరూ ఇంటి నిర్మాణాలు ప్రారంభించుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పెండింగ్ లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా చొరవ తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చే అర్జీలు, ఫిర్యాదులకు అధికారులు సరైన సమాధానం ఇవ్వడంతో పాటు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను సహనంతో విని పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ అధికారులు ఉదయం వేళల్లోనే క్షేత్రస్థాయిలో పర్యటించి గ్రామాల్లో ఉన్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని సూచించారు.

కేవలం కార్యాలయ పరిమితుల్లో కాకుండా ఫీల్డ్లో పని చేస్తూ ప్రజలకు సేవలందించాలని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో సమన్వయంతో పని చేసి, పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్, జిల్లా అటవీశాఖాధికారి సత్యనారాయణ, ఇతర అధికారులు, పానగల్ మండల ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.