18-09-2025 08:13:20 PM
ప్రజా పంపిణీ వ్యవస్థను సక్రమంగా నిర్వహించాలి..
అదనపు కలెక్టరుకు బీసీ పొలిటికల్ జెఎసి వినతి..
వనపర్తి టౌన్: జిల్లాలో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల భర్తీ కోసం వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వివిధ కారణాలతో అనేకమంది రేషన్ డీలర్లు లేరని, మరి కొంతమంది 6A కేసులపై సస్పెన్షన్లో ఉన్నారన్నారు. రేషన్ షాపులు ఎవరి పేరుపై ఉంటున్నాయో వారే అందుబాటులో ఉంటూ ప్రజలకు నిత్యావసర సరుకులు అందించాలని, అలాకాకుండా లైసెన్స్ తమ పేరుపై పెట్టుకొని ఇతరులతో రేషన్ షాపులను కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజలకు పంపిణీ చేస్తున్న సరుకులను అందించాల్సిన బాధ్యతలో ఉండాల్సిన వారు తప్పుడు మార్గంలో ఉంటున్నారని, అలాంటి వారిపై దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాంటి వారి స్థానంలో కొత్తవారిని నియమించాలని ప్రజా పంపిణీ వ్యవస్థను సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
రేషన్ షాపుల ద్వారా ప్రజలకు అందాల్సిన సరుకుల విషయంలో ప్రజా పంపిణీ వ్యవస్థ సక్రమంగా జరగాలన్నది బీసీ పొలిటికల్ జేఏసీ ఉద్దేశమని, రేషన్ డీలర్లకు బీసీ పొలిటికల్ జేఏసీ వ్యతిరేకం కాదని, గతంలో రేషన్ డీలర్లకు వేతనాలు పెంచాలని బీసీ పొలిటికల్ జేఏసీ పోరాటం చేసిందని గుర్తు చేశారు. తక్షణమే రేషన్ డీలర్లలో ఉన్న అవకతవకలను సరిచేసి, తప్పుడు మార్గంలో ఉన్న వారిపై చర్యలు తీసుకొని, ప్రజా పంపిణీ వ్యవస్థలో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ తరఫున ఆయన అధికారులను కోరారు. అదనపు కలెక్టర్ ఈ విషయంపై సానుకూలంగా స్పందించారని రాచాల తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి పట్టణ అధ్యక్షుడు దేవర శివ, కొత్తకోట మండల అద్యక్షులు అంజన్న యాదవ్, మదనాపూర్ మండల అధ్యక్షుడు మహేందర్ నాయుడు, నాగరాజు, యశ్వంత్, రాములు, రంగన్న, నరసింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.