21 March, 2026 | 4:25 AM

ఈవీ బస్సులు అద్దెకు కావలెను!

21-03-2026 01:07 AM

ఆర్టీసీలో చిత్రం!

* మనకు ఒక రోజు కారులో ప్రయాణించాల్సిన అవసరం ఉందని అను కుందాం.. ఒక్కరోజు అవసరాని కోసం కొత్త కారును కొంటామా..? కారుని కిరాయికి తీసుకుంటాం. దీనితో పని అయిపో తుంది. అలాకాకుండా.. ప్రతిరోజూ కారులో ప్రయాణించాల్సిన అవసరం ఉందని అనుకుందాం.. ప్రతిరోజూ కారు ను అద్దెకు తెచ్చుకుంటామా.. కొత్తగా మన మే కారును కొనుక్కుంటామా..? చిన్న పిల్లాడిని అడిగినా కొత్త కారు కొనుక్కోవడమే మంచిదని చెబుతాడు. ప్రతిరోజూ అద్దెకు తెచ్చుకోవడం వల్ల నష్టం వస్తుందని చెబుతాడు.

కొత్త కారు కొనడం ద్వారా డబ్బును ఆదా చేయవచ్చని స్పష్టంగా చెబుతాడు. కానీ ఈ చిన్న లాజిక్  కూడా రాష్ట్ర ప్రభుత్వం మిస్ అయ్యింది. ఆర్టీసీకి ఈవీ బస్సులను అద్దెకు తెచ్చుకుంటున్న వ్యవహారం ఇలాంటిదే. నిపుణులు, సామాజిక వేత్తలుకూడా అద్దెకు తెచ్చుకోవడం కన్నా.. అన్ని రకాల ఉద్యోగస్తులు ఉన్న ఆర్టీసీయే సొంతంగా ఈవీ బస్సులను కొనుక్కోవడం ఉత్తమమని, దీనిద్వారా డబ్బు ఆదా అవుతుందని స్పష్టంగా చెబుతున్నారు. ప్రభుత్వ తీరుపై ఆర్టీసీ కార్మికులతోపాటు, ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.        

  1. ఆర్టీసీలో ఈవీ బస్సుల హైర్ వ్యవహారంపై నిపుణులు పెదవి విరుపు
  2. కేంద్రం గ్రాంటు, ప్రజాధనం.. కార్పొరేట్ కంపెనీల పాలు
  3. పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి) : కొంతకాలంగా పర్యావరణ హితం, కర్బన ఉద్గారాల తగ్గింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈవీ బస్సులను ఆర్టీసీలో ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 500 బస్సులను హైదరాబాద్ నగరంతోపాటు ఇతర డిపోల్లోకి ప్రవేశపెట్టింది. త్వరలో మరికొన్ని బస్సులు వస్తున్నాయి.

రాబోయే మూడేండ్లలో మొత్తం 3 వేల ఈవీ బస్సులను సిటీలో ప్రవేశపెట్టనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికూడా ప్రకటించారు. దీనివల్ల కాలుష్యం తగ్గుతుందని, హైదరాబాద్ మరో ఢిల్లీ కాకుండా మనం కాపాడుకుందామంటూ ప్రభుత్వ నేతలు చెబుతున్నారు. సిటీ పరిధిలో ఉన్న సుమారు 3,500 డీజిల్ ఆర్టీసీ బస్సులను సిటీ బయటకు.. గ్రామీణ ప్రాంతాల్లోని డిపోలకు తరలిస్తామని చెబుతున్నారు.

అద్దెల మాటేంటి..

పర్యావరణాన్ని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరూ అంటున్నారు. అందుకు ఈవీ బస్సులే మార్గం. మరో మార్గం లేదు. కానీ ఈవీ బస్సులను తెచ్చుకుంటున్న విధానంలోనే అసలైన మతలబు ఉందని కార్మిక వర్గాలు కుండబద్దలు కొడుతున్నాయి. ఇప్పటికే ఆర్టీసీకి వచ్చిన ఈవీ బస్సులను అద్దెకు తెచ్చుకున్న విధానాన్ని పరిశీలిస్తే.. మనకుకూడా అనుమానం రాకమానదు.

అసలు ఆర్టీసీని బాగు చేస్తున్నారా.. తిరోగమనం చేస్తున్నారా అనే అనుమానం వస్తుంది. ప్రస్తుతం జేబీఎం కంపెనీకి చెందిన ఈవీ బస్సులకు ఒక కిలోమీటరుకు రూ. 40.50 పైసలు చొప్పున ఆర్టీసీ అద్దెను చెల్లిస్తోంది. అలాగే ఒలెక్ట్రా ఈవీ బస్సులకు కిలోమీటరుకు రూ. 60 చొప్పున ఆర్టీసీ చెల్లిస్తోంది. ఇలా ప్రతిరోజూ రూ. కోట్లను ఈవీ బస్సులకు అద్దెల రూపంలో చెల్లించాల్సి వస్తోంది.

సొంతంగా కొనుగోలు చేయవచ్చు..

వాస్తవానికి ఆర్టీసీయే సొంతంగా ఈవీ బస్సులను కొనుగోలు చేయవచ్చు. అయితే ఇందుకు ప్రభుత్వం అనుమతించాల్సి ఉం టుంది. కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఈవీ బస్సుకు రూ. 36 లక్షల గ్రాంట్‌ను ఇస్తోంది. ఇదికూడా ఆర్టీసీకి అదనపు ప్రయోజనమే. పైగా వేలాది బస్సులను నడిపించే శక్తి సామర్థ్యాలు ఆర్టీసీకి ఉంది. అంతటి మానవ వనరులు అయిన డ్రైవర్లు, కండక్టర్లు, సూపర్‌వైజర్లు, టెక్నీషియన్లు, శ్రామిక్‌లు, ఇంజనీర్లు, వర్క్‌షాప్‌లు ఆర్టీకి ఉన్నాయి.

ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలను ఇస్తే.. (ఉదాహరణకు మహాలక్ష్మి పథకం కింద రూ. 2500 కోట్లు రావాల్సి ఉంది) ఆ నిధులతో ఈవీ బస్సులను కొనుగోలు చేయవచ్చు. డ్రైవింగ్, నిర్వహణ, మరమ్మత్తులు, ఛార్జింగ్‌లపై చిన్నపాటి శిక్షణ ఇస్తే చాలు.. ఆర్టీసీ ఉద్యోగులే అన్నీ చూసుకోగల శక్తి వారి కి ఉంది. ఈవీ బస్సులను ప్రతిరోజూ ప్రజా రవాణాకు వినియోగించాల్సిందే. మరి అలాంట ప్పుడు అద్దెకు తీసుకోవడం వల్ల బస్సు జీవితకాలం మొత్తం..

ఆర్టీసీ నుంచి అద్దెరూపంలో అదాయాన్ని కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడమే అవుతుందని ఆర్టీసీ కార్మికులు ఆరోపించడం గమనార్హం. వ్యక్తిగతంగా ప్రతిరోజూ అవసరం ఉంటే.. సొంతంగా కారునే కొనుక్కోవాలనే సూత్రం ప్రకారం.. ఇక్కడ ఈవీ బస్సులను ఆర్టీసీయే కొనుగోలు చేసేలా నిర్ణయం తీసుకోవాల్సిన ప్రభుత్వం.. ఎందుకని అద్దెకు తీసుకుంటుందో తెలపాలంటూ కార్మికులు ప్రశ్నిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్కో ఈవీ బస్సుకు రూ. 36 లక్షల గ్రాంట్‌ను తీసుకుని.. ఆర్టీసీకి అద్దెకు ఇవ్వడం.. పైగా ఈవీ బస్సులను నడిపించేందుకు, నిర్వహించేందుకు కావాల్సిన మానవ వనరులను ఔట్ సోర్సింగ్ ద్వారా కార్పొరేట్ సంస్థలే నియమించుకోవడం.. ఇది నిరంతరాయంగా కొనసాగే.. దోపిడీ అని వారు ఆరోపిస్తున్నారు.

ఈవీ బస్సులను కొనుగోలు చేస్తే.. ఒక్కసారే లాభం రూపంలో దోచుకునేవారని.. అద్దెకు ఇవ్వడం ద్వారా ఆర్టీసీని నిరంతరాయంగా దోపిడీ చేయవచ్చనే దూరదృష్టితోనే ఇలాంటి పద్ధతికి తెరతీశారని వారంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకుని.. ఆర్టీసీయే సొంతంగా ఈవీ బస్సులను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కార్మికు లు డిమాండ్ చేస్తున్నారు.

కార్పొరేట్ సంస్థలకు లాభాల పంట.. 

నిజానికి ఈవీ బస్సులను కొనుగోలు చేయడం, అద్దెకు తీసుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటు ఉంది. కానీ ఎందుకనో.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈవీ బస్సులను అద్దెకు తీసుకోవడంపై ఉన్న శ్రద్ద.. సొంతంగా కొనుగోలు చేయడంపై కనపడటం లేదు. ఒక ఈవీ బస్సును ఆర్టీసీలోకి తీసుకొస్తే.. (తయారుచేస్తే) రూ. 36 లక్షల గ్రాంట్‌ను కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది.

ఒక్క ఈవీ బస్సును తయారు చేయాలంటే.. రూ. 2 కోట్లుగా ప్రస్తుతం వీటిని తయారుచేస్తున్న కంపెనీలు చెబుతున్న ధర అది. ఈ లెక్కన చూసుకున్నా.. కేంద్రం గ్రాంట్‌ను మినహాయిస్తే.. ఒక్కో ఈవీ బస్సు రూ. 1.64 లక్షలకే వస్తోందన్నమాట. ఈ బస్సులను తయారుచేస్తున్న కార్పొరేట్ సంస్థలు వాటిని ఆర్టీసీకి అమ్మడం కంటే.. అద్దెకు ఇవ్వడంపైనే ఆసక్తిగా ఉన్నాయి. ప్రభు త్వం నుంచికూడా యథాశక్తిగా అదే పద్ధతికి మద్ధత్తు లభిస్తోంది.

నిరంతరాయంగా.. దోపిడీ

వాస్తవానికి ఏ వస్తువు అయినా.. పరికరమైనా.. ఏదైనా సంస్థగానీ, కంపెనీగానీ తయారుచేసి అమ్మితే.. దాని తయారీకి అయిన ఖర్చుతోపాటు.. కొంత లాభంకూడా కలిపి అమ్ముతాయి. ఇదే సూత్రం ప్రకారం.. ఈవీ బస్సుల తయారీకి ఎంత ఖర్చు అయ్యిందో.. దానిపై లాభం వేసుకుని అమ్మితే.. ప్రభుత్వంకూడా కొనుగోలు చేస్తే.. సరిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతుందని విశ్లేషకులు, ఆర్టీసీ కార్మికులు ఆరోపిస్తున్నారు.

ఒకసారి బస్సును కొనుగోలు చేస్తే.. ఒక్కసారే సదరు కంపెనీకి ఎంతో కొంత (లాభం) ఎక్కువ చెల్లించాల్సి వస్తుందని.. అదే బస్సులను అద్దెకు తీసుకుంటే.. ప్రతిరోజూ అద్దెను చెల్లించాల్సి వస్తుందని.. దీనివల్ల లాభం ఉండదని ఆర్టీసీ కార్మికులు అంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం.. ఆర్టీసీ సంక్షేమాన్ని పట్టించుకోకుండా.. కార్పొరేట్ సంస్థల సంక్షేమం పట్ల కాస్త మక్కువ చూపుతున్నట్టుగా అర్థమవుతుందని వారంటున్నారు.

డిపోలు కార్పొరేట్ సంస్థలకు.. 

దశాబ్దాల చరిత్ర ఉన్న ఆర్టీసీ వేలాది బస్సులను నడిపించింది. నిర్మించింది. కొనుగోలు చేసిందికూడా. కొత్త టెక్నాలజీనికూడా ఉపయోగించుకోవడానికికూడా ఆర్టీసీలోని కార్మికులు, ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. పర్యావరణాన్ని రక్షించుకోవడానికి మేముకూడా సిద్ధంగానే ఉన్నాం. అందుకు మార్గం ఈవీ బస్సులే.

అయితే ఈవీ బస్సులను కొనుగోలు చేసే అధికారాన్ని ఆర్టీసీకి ఇవ్వకుండా.. కొన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం.. ఆ కార్పొరేట్ సంస్థలకు కేంద్రం ఒక్కో బస్సుకు రూ. 36 లక్షల గ్రాంట్ ఇవ్వడం.. ఆపై ఆర్టీసీకి ఈవీ బస్సులను అద్దెకు ఇవ్వడం.. అందులో పనిచేసే సిబ్బందిని కార్పొరేట్ సంస్థలే ఔట్ సోర్సింగ్ ద్వారా నియమించుకోవడం.. అద్దెకు ఇచ్చిన ఈవీ బస్సులకు ఛార్జింగ్ పాయింట్లు ఆర్టీసీ డిపోలోనే ఏర్పాటు చేయడం.. అందుకు ఆర్టీసీ రూ. కోట్లు పెట్టుబడి పెట్టడం.. తిరిగి అద్దె చెల్లించడం.. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న దోపిడీగా కనపడుతోంది.

మాకున్న డిపోలపై కార్పొరేట్ సంస్థలకు అజమాయిషీ ఇవ్వడం సరైంది కాదు. మా బకాయిలు మాకు ఇచ్చేస్తే.. ఆర్టీసీయే సొంతంగా ఈవీ బస్సులను కొనుగోలు చేయగలుగుతుంది. ఎందుకో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించకుండా.. కార్పొరేట్ సంస్థల దిశగా ఆలోచిస్తున్నట్టు కనపడుతోంది. ఇప్పటికే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశాం. ఈవీ బస్సులను కొనుగోలు చేసే అధికారం ఆర్టీసీకి ఇవ్వాలని కోరాము.

దీనివల్ల కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ ఆర్టీసీకి వస్తుంది. దీనితో తక్కువ ధరకే ఈవీ బస్సు వస్తుంది. అలాకూడా ఆర్టీసీకి ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. కేంద్రం గ్రాంట్‌ను కార్పొరేట్ సంస్థలు తీసుకుని.. ఆర్టీసీకి ఆ బస్సులను అద్దెకు ఇవ్వడమంటే.. నిరంతరాయంగా దోపిడీ చేయాలనే ఆలోచనను అమలు చేస్తున్నదనే చెప్పవచ్చు. దీనిపై ప్రభుత్వం మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

 మారంరెడ్డి థామస్‌రెడ్డి,

ఆర్టీసీ జాక్ వైస్ ఛైర్మన్,

టీఎంయూ ప్రధాన కార్యదర్శి