21 March, 2026 | 4:19 AM

తెలంగాణ ఆగం

21-03-2026 01:02 AM
  1.   6 గ్యారంటీల మోసాన్ని ఎండగడతాం
  2. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
  3. గన్ పార్క్ వద్ద బీఆర్‌ఎస్ నిరసన

హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి) : ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలుచేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ఆగంచేసిందని బీఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఆరోపణ చేశారు. దివ్యాంగులకు బాకీ పడ్డ రూ. 54,000 ఎక్కడ అని నిలదీశారు. నిరుద్యో గులకు హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ? నిరుద్యోగ భృతి ఏమైంది? అంటూ ప్రశ్నించారు.

శుక్రవారం గన్ పార్క్ వద్ద కేటీఆర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వ హామీల వైఫల్యంపై ప్లకార్డులతో నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన బాకీ కార్డులు ప్రదర్శిస్తూ ప్రజలను మోసం చేసిన విధానాన్ని బీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు ఎండగట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... ఆటో డ్రైవర్లకు ఇస్తామని చెప్పిన రూ. 24,000లో, సంవత్సరానికి రూ. 12,000 చొప్పున రెండు సంవత్సరాలుగా బాకీ ఉందని విమర్శించారు.

వృద్ధులకు ఇవ్వాల్సిన నెలకు రూ.4,000 చొప్పున మొత్తం రూ.54,000 బాకీ ఎక్కడ అని ప్రశ్నించారు. పేదింటి ఆడబిడ్డలకు ఇస్తామని చెప్పిన తులం బంగారం ఏమైందని నిలదీశారు. తెలంగాణ రాష్ట్ర సంపాదనను దోచుకుంటూ రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేసిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

మేము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి, ‘అభయహస్తం’ మేనిఫెస్టోతో ప్రజల ను నమ్మబలికి ఓట్లు దక్కించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇవాళ మూడో బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పటికీ ఆ హామీలకు చట్టబద్ధత కల్పించకుండా, నిధులు కేటాయించ కుండా ప్రజలను వంచిస్తోంది. ఈ మోసాన్ని నిలదీయడానికే అమరవీరుల స్తూపం సాక్షిగా ఈ నిరసన చేపట్టామని అన్నారు.

జేమ్స్ బాండ్ల మాదిరిగా బాండ్ పేపర్లు రాసిచ్చి, 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారు. ఇప్పుడు మూడో బడ్జెట్లో కూడా ‘గ్యారెంటీ’ అన్న మాట లేకుండా, ‘డిక్లరేషన్’ అన్న మాట లేకుండా ప్రతి వర్గాన్ని వంచిస్తున్నా రు అని కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వంపై పలు కీలక అంశాలపై కేటీఆర్ ప్రశ్నలు లేవనెత్తారు. బలహీన వర్గాలకు లక్ష కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పి, మూడు బడ్జెట్లు కలిపినా 20 వేల కోట్లకు మించకుండా కేటాయించడాన్ని ప్రశ్నించారు.

వృద్ధులు, వితంతువులు ఎదురు చూస్తున్న రూ. 4,000 పెన్షన్ ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలకు 18 ఏళ్లు నిండిన కోటి 58 లక్షల మందికి ఇస్తామని చెప్పిన రూ. 2,500 మహాలక్ష్మి పథకం ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5 లక్షల దివ్యాంగులకు రూ.6,000 పెన్షన్ హామీ అమలు చేయాలన్నారు. రైతులకు రైతు భరోసా పేరుతో రూ. 15,000 ఇస్తామని చెప్పి, ఇప్పటికే ఉన్న రైతుబంధునే అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు.

సంక్రాంతికి రావాల్సిన డబ్బులు ఉగా ది దాటినా రాకపోవడం ప్రభుత్వ వైఫల్యమన్నారు. ఉద్యోగాల విషయంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం 11,900 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని, ఇది యువతను మోసం చేయడమేనని పేర్కొన్నారు. మీరు రాసిచ్చిన బాండ్ పేపర్లు ఇవాళ నీటి మీద రాతలైపోయాయి. శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో ప్రతి అడుగునా రాష్ట్ర ప్రజల తరపు న మిమ్మల్ని నిలదీస్తాం. హామీలు నిలబెట్టుకోకపోతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని కేటీఆర్ హెచ్చరించారు.