18-09-2025 08:16:08 PM
అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్యా నాయక్
వనపర్తి (విజయక్రాంతి): జిల్లాలో ఖరీఫ్ 2025-26 సీజన్ వరి ధాన్యం కొనుగోళ్లకి సంబంధించి అక్టోబర్ మొదటి వారంలోగా కొనుగోలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్యా నాయక్(Additional Collector Kheemya Naik) ఆదేశించారు. గురువారం అదనపు కలెక్టర్ తన ఛాంబర్ లో వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ 2025-26 సీజన్ వరి ధాన్యం కొనుగోళ్ళకి సంబంధించి అక్టోబర్ మొదటి వారంలోగా కొనుగోలు ప్రారంభించేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులు ఇప్పటినుంచే అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.
ఐకేపీ, మెప్మా, పాక్స్ తరపున ఏర్పాటు చేయబోయే కేంద్రాలపై నివేదిక ఇవ్వాలన్నారు. సన్న రకం వరి ధాన్యానికి దొడ్డు రకం వరి ధాన్యానికి కొనుగోళ్లకు వేర్వేరుగా కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. టెంటు, తాగునీరు సహా గన్ని బ్యాగులు, బరువు కొలిచే యంత్రాలు, తేమ శాతం కొలిచే క్యాలిపర్స్, క్లీనర్లు, టార్పాలిన్ కవర్లు అన్ని కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన అన్ని ఉండేవిధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. టార్పాలిన్లు, బరువు కొలిచే యంత్రాలు, ఇతర పరికరాలు అదనంగా అవసరం ఉంటే ఇండెంట్ ఇవ్వాలని సంబంధిత అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి కాశీ విశ్వనాథ్, పౌరసరఫరాల డిఎం జగన్మోహన్, డి ఆర్ డి ఓ ఉమాదేవి, డీఏవో ఆంజనేయులు గౌడ్, మార్కెటింగ్ అధికారి స్వరణ్ సింగ్, డి సి ఓ రాణి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.