ఎవరి గెలుపు మార్కెట్‌కు మలుపు
ఎన్నికల ఫలితాలు జూన్ 4న, జూన్ 1న ఎగ్జిట్ పోల్స్
లోక్‌సభ ఫలితాల తర్వాత ఇన్వెస్టర్ల స్పందనపై విశ్లేషణ
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటివరకూ జరిగిన వివిధ దశల పోలింగ్‌లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైన కారణంగా ఇన్వెస్టర్లు ఫలితాల పట్ల టెన్షన్ పడుతున్నారు. ఎన్నికలు మొదలయ్యేంతవరకూ మళ్లీ నరేంద్ర మోది నేతృత్వంలోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతుందన్న గట్టి అంచనాలు మార్కెట్లో ఉన్నాయి. కానీ నాలుగు దశల ఓటింగ్ సరళిని చూసి ఆ అంచనాలు సన్నగిల్లాయి. ప్రపంచ మార్కెట్లన్నీ స్థిరంగా అప్‌ట్రెండ్ కొనసాగిస్తున్నా, దలాల్ స్ట్రీట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నది. ఈ నెలలో ఇప్పటివరకూ బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,500 పాయింట్లు నష్టపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు మార్కెట్ నుంచి రూ.30,000 కోట్లకుపైగా వెనక్కు తీసుకున్నారు. 2019 ఎన్నికల్లో తొలి నాలుగు దశల్లో నమోదైన 69 ఓటింగ్ శాతంకంటే ఇప్పుడు తక్కువగా 66.9 శాతమే ఓటింగ్ జరిగింది. మరో 163 లోక్‌సభ స్థానాలకు వచ్చే మూడు దశల్లో పోలింగ్ జరుగుతుంది. జూన్ 1 నాటికి పోలింగ్ ముగుస్తుంది.
ఓవర్ రియాక్షనా?
బెట్టింగ్ మార్కెట్లలో (ఫలోడి సత్తా బజార్) బీజేపీ 300 స్థానాల్లో విజయం సాధిస్తుందన్న అంచనాలు నడుస్తున్నప్పటికీ, ఈ సంఖ్య సైతం కొంతమంది స్టాక్ ట్రేడర్లను నిరుత్సాహపరుస్తున్నదని ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది. అలాగే బీజేపీ ఎన్నికల ప్రచారం ప్రభుత్వ సంబంధిత ధీమ్స్ నుంచి మతపరమైన అంశాలవైపు మళ్లడం సైతం మార్కెట్ పతనానికి కారణమయ్యిందని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. ప్రచార వ్యూహాలను మార్చుకోవడానికి వెనుక ఉన్న కారణాల్ని ఇన్వెస్టర్లు అన్వేషించేపనిలో పడ్డారని, అయోమయం వెంటాడుతున్నదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ బ్రోకరేజ్ నోమురా తాజాగా ఒక నోట్ విడుదల చేస్తూ గత ఎన్నికల సంవత్సరాల్లో వివిధ దశల పోలింగ్‌తో తాజా ఓటింగ్‌ను పోల్చుకుని మార్కెట్ ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నదని పేర్కొంది. 2019లో అన్ని దశల్లో కలిపి నమోదైన 67.4 శాతంకంటే ఈ దఫా ఇప్పటివరకూ 66.9 శాతం కాస్త తక్కువని, కానీ 2014 ఎన్నికల పోలింగ్‌తో సమానమని నోమురా వివరించింది. అందుచేత ఓటింగ్ శాతానికి, ప్రభుత్వ వ్యతిరేకతకు లింకేదీ లేదన్నది. ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడనున్నప్పటికీ, జూన్ 1నాటి ఎగ్జిట్ పోల్స్‌తో మార్కెట్‌కు కొంతవరకూ స్పష్టత వస్తుంది. గతంలో ఎగ్జిట్ పోల్స్ చాలావరకూ వాస్తప ఫలితాలకు దగ్గరగా ఉన్నాయని నోమురా అనలిస్టులు సోనాల్ వర్మ, అరదీప్ నందిలు తెలిపారు. ఎన్నికల ఫలితాల తర్వాత మూడు దృష్టాంతాల్లో మార్కెట్ స్పందన ఎలా ఉండవచ్చన్న అంశంపై నోమురా విశ్లేషణ ఇది..
ఇండియా కూటమి గెలిస్తే..
కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి యా కూటమి మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తే చాలావరకూ దేశీయ ఆధారిత రంగాల్లో..ప్రత్యేకించి ఫైనాన్షియల్స్, ఇండస్ట్రియల్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కన్జూమర్ డిస్క్రీషననరీ, పీఎస్‌యూలు నిలువునా పతనమవుతాయని నోమురా అంచనా వేసింది. కన్జూమర్ స్టేపుల్స్, ఐటీ సర్వీసులు, ఫార్మాస్యూటికల్స్ రంగాల షేర్లు మార్కెట్‌ను అవుట్‌పెర్‌ఫార్మ్ చేస్తాయన్నది.






