6 April, 2026 | 3:38 PM

ధన్‌తేరస్‌పై ధరల ప్రభావం

30-10-2024 12:26 AM
  1. సాధారణంగానే పసిడి అమ్మకాలు 
  2. కొనుగోళ్లపై అంతగా ఆసక్తి చూపని జనాలు
  3. కొన్ని షాపులు కళకళ.. మరికొన్ని వెలవెల

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 29 (విజయక్రాంతి): గత కొద్ది రోజులుగా ఆకాశాన్నంటుతున్న పసిడి ధరల ప్రభావం ధన్‌తేరస్(ధన త్రయోదశి)పై పడింది. సాధారణంగా ధన్‌తేరస్ రోజున బంగారం అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని నగరంలోని వ్యాపారులు అంచనా వేసినప్పటికీ.. పెరిగిన ధరల వల్ల సేల్స్ గతం కంటే తగ్గినట్లు తెలుస్తోంది.

ఈసారి సాధారణ అమ్మకాలే జరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. అమ్మకాలు గతం కంటే 20 నుంచి 30 శాతం తగ్గాయని అంచనా. గతేడాది ధన్‌తేరస్ రోజున 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర దాదాపు రూ.6 వేలు ఉండగా, ఈసారి రూ.8,045కు చేరింది.

ధరల పెరుగుదలతో మధ్య తరగతి ప్రజలు అనాసక్తి చూపినట్లు తెలుస్తోంది. ఎగువ మధ్యతరగతికి చెందిన వారే కొనుగోళ్లపై మక్కువ చూపించారు. దీంతో కొన్ని షాపు లు వెలవెలబోగా.. మరికొన్ని షాపులు కళకళలాడాయి. 

ప్రముఖ షాపుల్లో కోలాహలం

ధన్‌తేరస్ రోజున ప్రజలు ముఖ్యం గా లక్ష్మీదేవి, కుబేరుడు, ధన్వంతరి పూజలు చేస్తారు. ఈ రోజున బంగా రం, వెండి ఆభరణాలను కొనుగోలు చేస్తే ఐశ్వర్యంగా భావిస్తారు. ఎంతో కొంత పసిడిని కొనుగోలు చేయాలనుకునే వారు ధరల ప్రభా వంతో షాపులకు వెళ్లేందుకు అనాసక్తితో ఉన్నట్లు వ్యాపారులు చెప్పారు. ఇదిలా ఉండగా నగరంలోని కొన్ని ప్రముఖ జ్యూవెల్లరీ షాపుల్లో మాత్రం కోలాహలం కనిపించింది.

ప్రముఖ జ్యువెలరీ షాపుల్లో వినియోగదారులకు సులభతరంగా ఉండేందుకు 22 క్యారెట్, 16 క్యారెట్ ఆభరణాలను అందుబాటులో ఉంచడమే కారణంగా తెలుస్తోంది. నగరంలోని ఓ ప్రముఖ జ్యూవెల్లరీ షాపులో ఏకంగా 9 క్యారెట్ ఆభరణాలను కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంచినట్లు తెలిసింది.