2 June, 2026 | 2:43 AM

ఇహెచ్‌ఎస్ విధి విధానాలు ఖరారు కాకముందే 1.5 శాతం కోతలు అన్యాయం

02-06-2026 12:03 AM

తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష,  కార్యదర్శిలు ముకురాల చంద్రశేఖర్ గౌడ్, డాక్టర్ దేశబోయిన రమ

ముషీరాబాద్, జూన్ 1(విజయక్రాంతి): ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్) అమలుకు సంబంధించిన విధి విధానాలు ఇంకా పూర్తిగా ఖరారు కాకపోయినా, హాస్పిటల్స్తో ఒప్పందాలు కుదరకపోయినా, ప్యాకేజీ రేట్లు నిర్ణయించకపోయినా, డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేయకపోయినా, ఉద్యోగుల వేతనాల నుండి1.5 శాతం చందా పేరుతో కోత విధించడం అత్యంత దురదృష్టకరమని తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం (టీబీసీయూఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఎం. చంద్రశేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ దేశబోయిన రమ సోమవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.

ఇహెచ్‌ఎస్ అమలుకు సంబంధించిన స్పష్టమైన ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో) లేకుండానే వేతనాల్లో కోతలు విధించడం ఉద్యోగులు, పెన్షనర్లలో తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందన్నారు. కుటుంబ సభ్యుల వివరాల నమోదులో ఇంకా అనేక సమస్యలు కొనసాగుతున్నాయన్నారు. ఆధారిత కుటుంబ సభ్యుల అర్హతపై స్పష్టత లేదని పేర్కొన్నారు.

ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే పాత విధానాల ప్రకారం ఒక్కరి నుంచే చందా వసూలు చేయాల్సి ఉండగా, ప్రస్తుతం ఇద్దరి వేతనాల నుంచి కోతలు విధించడం సరైన చర్య కాదన్నారు. ఇలాంటి అంశాలపై ప్రభుత్వం ముందుగా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి తక్షణమే జోక్యం చేసుకుని ఇహెచ్‌ఎస్ చందా పేరిట జరుగుతున్న వేతన కోతలను నిలిపివేసి, విధి విధానాలపై పూర్తి స్పష్టత వచ్చిన తరువాత మాత్రమే అమలు చర్యలు చేపట్టాలన్నారు.  అలాగే ఉద్యోగి ఈహెచ్‌ఎస్ పథకం లో చేరాలా వద్దా అనే స్వేచ్ఛ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.