అనుబంధాల్లో అక్రమాలు
దేశవ్యాప్తంగా ఈ మధ్యకాలంలో తరచుగా జరుగుతున్న అమానవీయ ఘటనలు, దారుణాలు మానవత్వాన్ని నిలువునా పూడ్చిపెడుతున్నాయి. నిత్యం ఏదో ఒక మూలన చోటుచేసుకుంటున్న లైంగికదాడులు, హత్యా ఘటనలు సమాజాన్ని తీ వ్రంగా కలవర పెడుతున్నాయి. వివాహేతర బంధాల మాయలో కట్టుకున్న భర్తలను, భార్యాపిల్లలను అంతమొందిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. చివరికి ముక్కపచ్చలారని పిల్లలను సైతం అడ్డు తొలగించుకుంటున్న తీరు సంబంధబాంధవ్యాలపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
రంగారెడ్డి జిల్లా షాబాద్ పరిధిలోని దైవాలగూడలో ఇటీవల ఆరుగురిని బలితీసుకున్న కిరాతక ఉన్మాదం చట్టాల లొసుగులు, రక్షణ వ్యవస్థల నిర్లక్ష్యం, విచ్చలవిడి వికృత పోకడల మధ్య నలిగిపోతున్న సామాన్యుడి అభద్రతాభావానికి ప్రతీకగా నిలిచింది. తనపై పోక్సో కేసు పెట్టారన్న కక్షతో బెయిల్‌పై వచ్చిన రాజ్‌కుమార్ అనే ఉన్మాది.. ఓ మైనర్ బాలికను, ఆమె తల్లి, వృద్ధురాలైన నానమ్మ ను అత్యంత కిరాతకంగా చంపేసిన ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది.
అంతటితో ఆగకుండా ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్యను, లోకం తెలియని నాలుగేళ్లు, 18 నెలల పసిపిల్లలను నిద్రిస్తున్నప్పుడే గొం తుకోసి నరరూప రాక్షసుడిలా ప్రవర్తించిన తీరు ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. రక్షణ క ల్పించాల్సిన చట్టాలు, బెయిల్ వ్యవస్థలు నేరగాళ్లకు అస్త్రాలుగా మారుతున్నాయనడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నిందితుడు బెదిరిస్తున్నా స్థానిక పోలీసులు నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ ఆరు ప్రాణాలు గాల్లో కలిశాయంటూ బాధితుల కుటుంబా ల ఆర్తనాదాలు గుండెలను పిండేస్తున్నాయి.
సంచలనం సృష్టించిన పలు ఘటనలు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వివాహేతర సంబంధాల హత్యలు చాలా దారుణంగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా న్యాకల్‌కు చెందిన ప్రశాంత్ గల్ఫ్ నుంచి స్వగ్రామానికి రాగా, అతని భార్య సంధ్య తన ప్రియుడు అనిల్‌తో కలిసి అడ్డు తొలగించుకోవాలని చూసింది. మొదట అతనికి మిత్రుల సహాయంతో మద్యం తాగించి బిల్డింగ్ పైనుంచి కిందకు తోసేశారు. అక్కడా బతికి బట్టగట్టి ఆసుపత్రికి వెళ్తే.. చివరకు స్లున్ ఐవీ లైన్ ద్వారా టాయిలెట్ క్లీనర్‌ను ఇంజెక్షన్ ఇచ్చి కిరాతకంగా కడతేర్చారు.
హైదరాబాద్ మియాపూర్ పరిధిలో 2025 డిసెంబర్‌లో మిస్సింగ్ అయిన పెంతేష్ ఇదే తరహాలో హత్యకు గురవడం పోలీసులనే ఆశ్చర్యపరిచింది. మృతుడి భార్య సత్యవతి తన ప్రియుడు మధుసూదన్‌రెడ్డి, మరో వ్యక్తితో కలిసి పథకం ప్రకారం భర్తను చంపి, ఎవరికీ దొరకకుండా మృతదేహాన్ని పొరుగు రాష్ట్రం దాకా తీసుకువెళ్లి కాల్చి బూడిద చేసిన ఉదంతాన్ని పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఛేదించారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం బాసవాయిపల్లిలో నాగేశ్ అనే వ్యక్తి ఇంట్లో నిద్రిస్తుండగా అతని భార్య కవిత కత్తితో గొంతుకోసి దారుణంగా హతమార్చింది. చిన్నకుమారుడి కళ్లెదుటే ఈ ఘాతుకం జరగగా, వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే అనుమానంతోనే ఈ హత్య జరిగినట్లు స్థానికులు వెల్లడించారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పరిధిలో భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో భర్త ఆమెను హతమార్చాడు. అంతటితో ఆగక మృతదేహాన్ని రంపంతో ముక్కలు ముక్కలుగా కోసి, మూటగట్టి మూసీ నదిలో పడేసిన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా పెనుసంచలనం రేపింది. అలాగే నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఐలాపురంలో ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కక్షతో సదరు మహిళ పిల్లలైన అక్కా, తమ్ముడు కలిసి స్వయానా తమ బాబాయిని దారుణంగా హత్య చేసి, ఎవరికీ అనుమానం రాకుండా గుట్టుచప్పుడు కాకుండా పూడ్చిపెట్టిన ఘటన వెలుగుచూసింది.
ప్రతి 10 హత్యలలో ఒకటి..
ఇటీవల నిత్యం ఏదో ఒక చోట వివాహేతర సంబంధాల కారణంగా జీవిత భాగస్వామిని అంతమొందిస్తున్న ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా నివేదిక ప్రకారం, దేశంలో జరుగుతున్న ప్రతి 10 హత్యలలో ఒకటి వివాహేతర సంబంధాలు లేదా ప్రేమ వ్యవహారాల కక్షల వల్లే జరుగుతున్నాయని స్పష్టమవుతున్నది. ఈ తరహా నేరాలలో తెలంగాణ కూడా మొదటి వరుస రాష్ట్రాలలో నిలుస్తుండటం సామాజిక విలువల పతనానికి అద్దం పడుతోంది.
విలువల పతనం వైఫల్యం
ఇలాంటి అమానవీయ ఘటనలు షాబాద్‌కే పరిమితం కావడం లేదు. ఈ మధ్యకాలంలో రాష్ట్రవ్యాప్తంగా కక్షలు, క్షణికావేశాలు, సోషల్ మీడియా వికృత పోకడలు, వేధింపుల కారణంగా ఎందరో మహిళలు, చిన్నారులు బలవుతున్నారు. చట్టాలు ఎంత కఠినంగా మారుతున్నా, ఉన్మాదులలో భయం చావకపోవడానికి కారణం క్షేత్రస్థాయిలో నిఘా లోపించడమే. వేధింపులకు గురవుతున్న బాధితులు ఫిర్యాదు చేసిన వెంటనే కౌన్సిలింగ్‌లు, నామమాత్రపు కేసులతో సరిపెట్టకుండా నిందితుల కదలికలపై నిఘా ఉంచాలి.
చుట్టుపక్కల జరుగుతున్న దారుణాలను చూస్తూ కూడా మౌనంగా ఉండటం నేరస్తులకు మరింత బలాన్ని ఇస్తుంది. నిర్లక్ష్యం వహించిన అధికారులపై సస్పెన్షన్లతో సరిపెట్టకుండా, పౌరుల ప్రాణాలకు భద్రత కల్పించే పటిష్ట కార్యాచరణ చేపట్టాలి. పసిపిల్లల గొంతులు కోసే సమాజంలో మనం బతుకుతున్నామా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరినీ వేధించక మానదు. ఇప్పటికైనా చట్టాలు, రక్షణ వ్యవస్థలు, సమాజం కలిసికట్టుగా మేల్కోకపోతే.. షాబాద్ లాంటి మారణకాండలు పునరావృతమవుతూనే ఉంటాయి, మానవత్వం మంటగలుస్తూనే ఉంటుంది.
పెరుగుతున్న విచ్చలవిడితనం
చట్టాల్లో లోపాలు, పెరుగుతున్న విచ్చలవిడితనం వల్లనే జీవిత భాగాస్వాములపై హత్యోదంతాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దేశంలో మహిళలపై దాడులు, లైంగికదాడులు, కుటుంబ హింస, వరకట్న వేధింపులు పెరిగిపోయి, వారి ఉనినినే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళలు, చిన్నారులపై లైంగికదాడులు ఆగడం లేదు. చట్టాల అమలులో కొన్ని లోపాలు ఉండడం వల్ల షాబాద్ తరహా ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయనంలో ఎలాంటి సందేహం లేదు. మనదేశంలో చట్టాలు ఆమోదించడానికి ఏళ్ల తరబడి పోరాటాలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి.
విదేశాల్లో కఠిన చట్టాలు
నేరాల తీవ్రతను బట్టి మన దేశంతో పాటు ఇతర దేశాలలో శిక్షలు మారుతుంటాయి. భారత్‌లో అత్యంత తీవ్రమైన నేరాలకు భారతీయ న్యాయ సంహిత ప్రకారం శిక్షలు వేస్తారు. మన దేశంలో నేరాలకు మరణశిక్ష(ఉరి), జీవిత ఖైదు, కఠిన కారాగార శిక్ష వంటివి ఉన్నాయి. మరణశిక్షను అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే విధిస్తారు. కానీ, అమెరికా, చైనా, వియత్నాం వంటి దేశాల్లో ఇంజక్షన్ ద్వారా, సౌదీ అరేబియాలో బహిరంగంగా శిరచ్ఛేదనం ద్వారా, చైనా, ఉత్తర కొరియా వంటి దేశాల్లో ఘటన జరిగిన కొంత సమయానికే నేరం రుజువైతే బహిరంగంగా తుపాకీతో కాల్చి చంపడం వంటి శిక్షలు అమలు చేస్తున్నారు.
అదేవిధంగా సౌదీ అరేబియా, ఇరాన్, యూఏఈ వంటి దేశాలు షరియా చట్టాన్ని అనుసరించి కఠినమైన శిక్షలు వేస్తున్నాయి. వ్యభిచారం, హత్యా నేరాలకు బహిరంగ శిక్షలు లేదా అంగచ్ఛేదనం వంటి శిక్షలు అమలుపరుస్తున్నారు. సింగపూర్, యూఏఈ లాంటి చిన్న దేశాలలో పారిశుద్ధ్య నిబంధనలు ఉల్లంఘించడం, డ్రగ్స్ వాడకం వంటి చిన్నచిన్న నేరాలకు కూడా భారీ జరిమానాలు, కొరడా దెబ్బల లాంటి శిక్షలు అమలు చేస్తున్నారు. దీంతో ఆయా దేశాల్లో క్రైమ్ రేట్ తగ్గుతున్నది.
కానీ, మన దేశంలో కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతూ, తప్పు చేసినా చట్టాలను అనుకూలంగా మారుస్తుండడంతో చట్టాలను ఖాతరు చేసే పనే లేదన్నట్టుగా నేరస్తులు దాడులు, అత్యాచారాలకు తెగపడుతూనే ఉన్నారు. నెలల పసికందా? మైనరా? గర్భిణీనా? వృద్ధురాలా? లాంటివేమీ పట్టనట్టుగా నిమిషాల కోరిక కోసం క్రూరంగా మారుతున్నారు. నేరస్థులు అందరికీ ఒకే రకమైన శిక్షలు చట్టబద్ధంగా ఉండాలి. విచారణ పేరుతో జాప్యం జరగకుండా నిందితులు చట్టం లొసుగులతో తప్పించుకునే అవకాశం లేని విధంగా చట్టాలు తీసుకురావాలి. అప్పుడన్నా సమాజంలో తప్పు చేయాలనే భావన రాకుండా ఉంటుందేమో వేచి చూద్దాం.
వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్






