రణమండల ఆంజనేయుడి నేపథ్యంలో..
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరో చిత్రానికి సన్నాహాలు షురూ చేసింది. భారీ యాక్షన్ డివోషనల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుందీ సంస్థ. హనుమంతుని నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్, యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు కీలకంగా ఉండనున్నాయి. ఈ చిత్ర టైటిల్ లాంచ్ ఈవెంట్ ఆదివారం ఆదోని రణమండల ఆలయంలో జరిగింది.
రణమండల ఆంజనేయుని సన్నిధిలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రకటించారు. ఫస్ట్ లుక్‌నూ విడుదల చేశారు. రణమండల ఆంజనేయ క్షేత్ర నామాన్నే ఈ చిత్రానికి టైటిల్‌గా పెట్టడం విశేషం. ఈ సందర్భంగా నిర్మాత విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. “తన స్వస్థలం ఆదోనిలో సినిమాలు షూటింగ్ చేయాలని ఎప్పట్నుంచో సన్నాహాలు చేస్తున్నాం.
సరైన సమయం, కథ కోసం ఇన్నాళ్లు ఆగాం. ‘రణమండల’ కథ 2022 నుంచే సిద్ధం చేస్తున్నాం. ఇది మాకు 46వ చిత్రం. పూర్తిగా ఆదోని పరిసర ప్రాంతాల్లోనే దీన్ని చిత్రీకరిస్తాం. నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం. మా 47వ చిత్రాన్ని కూడా ఆదోనిలోనే పూజా కార్యక్రమాలతో నవంబర్‌లో ప్రారంభించి, ఇక్కడి పరిసర ప్రాంతాల్లోనే షూట్ చేసేలా సన్నాహాలు చేస్తున్నాం” అని టీజీ తెలిపారు.




