పంజాబ్ పోటీలోనే..

02-05-2024 12:53:54 AM

బెయిర్‌స్టో, రొసో మెరుపులు

పొట్టి క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఫుల్ జోష్‌లో ఉన్న పంజాబ్ కింగ్స్.. చెన్నై సూపర్ కింగ్స్‌పై ఘన విజయం సాధించింది. చెపాక్ స్టేడియంలో జరిగిన సాధారణ స్కోర్ల పోరులో పంజాబ్‌దే పైచేయి అయింది. మొదట బౌలర్లు సమష్టిగా సత్తాచాటి సొంతగడ్డపై చెన్నై బ్యాటర్లకు కళ్లెం వేయగా.. ఆనక బ్యాటింగ్‌లో బెయిర్‌స్టో, రొసో రాణించడంతో పంజాబ్ కింగ్స్ లీగ్‌లో నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఒక దశలో ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నట్లే కనిపించిన పంజాబ్.. ఈ ప్రదర్శనతో తమ అవకాశాలను కాస్త మెరుగు పర్చుకుంది. 

చెన్నై: గత మ్యాచ్‌లో రికార్డు లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్ ఈసారి ఓ మోస్తరు లక్ష్యాన్ని కష్టపడి అందుకుంది. బుధవారం జరిగిన పోరులో పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (48 బంతుల్లో 62; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును ముందుండి నడిపించగా.. అజింక్యా రహానే (29) పర్వాలేదనిపించాడు. ఎప్పట్లాగే మహేంద్రసింగ్ ధోనీ (14; ఒక ఫోర్, ఒక సిక్సర్) చివర్లో క్రీజులోకి వచ్చి మైదానాన్ని హోరెత్తించాడు. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో పంజాబ్ 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. బెయిర్‌స్టో (30 బంతుల్లో 46; 7 ఫోర్లు, ఒక సిక్సర్), రొసో (23 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఆఖర్లో కాస్త ఒత్తిడి ఎదురైనా శశాంక్ సింగ్ (25 నాటౌట్), సామ్ కరన్ (26 నాటౌట్) మిగిలిన పని పూర్తిచేశారు. చెన్నై బౌలర్లలో శార్దూల్, గ్లీసన్, శివమ్ దూబే తలా ఒక వికెట్ పడగొట్టారు. లీగ్‌లో భాగంగా గురువారం ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. 

రుతురాజ్ ఒక్కడే

పసుపు రంగు పులుముకున్న స్టేడియంలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు శుభారంభం దక్కింది. రహానే, రుతురాజ్ రాణించడంతో ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించిన అనంతరం రహానే ఔట్ కాగా.. ఈ సీజన్‌లో భారీ సిక్సర్లతో రెచ్చిపోతున్న లెఫ్ట్ హ్యాండర్ శివమ్ దూబే (0) తొలిసారి విఫలమయ్యాడు. ఎదుర్కొన్న తొలి బంతికే వికెట్ల ముందు దొరికిపోయాడు. కాసేపటికే రవీంద్ర జడేజా (2) కూడా ఔట్ కాగా.. సమీర్ రిజ్వి (21) సాయంతో రుతురాజ్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. మోయిన్ అలీ (15) ఎక్కువ సేపు నిలువలేకపోయాడు. పంజాబ్ బౌలర్లలో రాహుల చాహర్, హర్‌ప్రీత్ బ్రార్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. రాహుల్ 4 ఓవర్లలో 16 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టగా.. హర్‌ప్రీత్ 17 రన్స్ ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో చెన్నై బౌలర్లు కూడా చక్కటి బౌలింగ్ ప్రదర్శన కనబర్చినా.. లక్ష్యం మరీ చిన్నదైపోవడంతో పంజాబ్ అలవోకగా విజయం సాధించింది. అంతకుముందు చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్ మరోసారి టాస్ ఓడిపోయాడు. ఈ సీజన్‌లో చెన్నై ఆడిన 10 మ్యాచ్‌ల్లో తొమ్మిదింట రుతురాజ్ టాస్ ఓడి పోవడం గమనార్హం. 

సంక్షిప్త స్కోర్లు

చెన్నై: 20 ఓవర్లలో 162/7 (రుతురాజ్ 62, రహానే 29; రాహుల్ చాహర్ 2/16, హర్‌ప్రీత్ 2/17), 

పంజాబ్: 17.5 ఓవర్లలో 163/3 (బెయిర్ స్టో 46, రొసో 43; దూబే 1/14).