17 June, 2026 | 3:00 PM

కోల్‌కతా అత్యాచార కేసులో.. దోషులను కఠినంగా శిక్షించాలి

18-08-2024 12:22 AM

వైద్యులు, జూడాలు, వైద్యసిబ్బంది డిమాండ్

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో ఓపీ బంద్

మృతురాలికి నివాళిగా కొవ్వొత్తుల ర్యాలీలు

విజయక్రాంతి నెట్‌వర్క్ : కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటనపై శనివారం తెలంగాణవ్యాప్తంగా నిరసన లు వెల్లువెత్తాయి. హైదరాబాద్‌లోని ప్రభు త్వ ప్రధాన ఆసుపత్రులైన ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, నిమ్స్, చెస్ట్, ఫీవర్, మానసిక వైద్యశాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల పరిధిలో వైద్యులు, జూడాలు, వైద్యసిబ్బంది ఓపీ సేవలను నిలిపివేశారు. కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు.

దవాఖానల ఎదుట ఫ్లకార్డులు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు. కోల్‌కతా ఘటనలో బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తీర్మానం చేశారు. సోమ, మంగళ వారాల్లోనూ నిరసన కొనసాగిస్తామన్నారు. వైద్యులపై దాడులను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విధానాన్ని అమలు చేయాలని, ఈ మేరకు జీవోను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిరోజూ 2,500 నుంచి 3 వేల దాకా ఓపీ సేవలు అందే గాంధీ, ఉస్మానియా దవాఖానల్లో ఓపీ సేవలు బంద్ కావడంతో రోగులు ఇబ్బందులకు గురయ్యారు.

మరోవైపు కోల్‌కతా అత్యాచార ఘటనలో మృతిచెందిన వైద్యురాలికి నివాళిగా నారాయణగూడ వైఎంసీఏ చౌరస్తాలో ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్ నగర కమిటీ, ట్యాంక్‌బ్యాండ్‌పై బీజేపీ మహిళా మోర్చా నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హనుమకొండ, జనగాం, సూర్యాపేట, ఆసిఫాబాద్, నిర్మల్, భద్రాద్రి, కరీంనగర్, కామారెడ్డి నిజామాబాద్ తదితర జిల్లాల్లోనూ భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి.