17 June, 2026 | 1:15 PM

‘స్కూల్‌కు వెళ్లొస్తా అమ్మ’ అని చెప్పి..

18-08-2024 12:25 AM

బయల్దేరిన విద్యార్థినిని కబళించిన మృత్యువు

ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిఉన్న ఆటోను ఢీకొట్టిన డీసీఎం

విద్యార్థిని మృతి, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 17 (విజయక్రాంతి) : రోజూ మాదిరిగానే ‘స్కూల్‌కు వెళ్లొస్తా అమ్మ’ అని చెప్పి ఇంటినుంచి బయల్దేరిన ఆ విద్యార్థిని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. అమ్మా అనే ఆ పిలుపు మూగపోవడంతో ఆ తల్లి రోదన వర్ణనాతీతం. తార్నాకకు చెందిన సాత్విక (16) హబ్సిగూడలోని గౌతమ్ మోడల్ స్కూల్‌లో పదవ తరగతి చదువుతోంది.  రోజూ మాదిరిగానే శనివారం ఇంటి నుంచి ఆటోలో స్కూల్‌కు బయల్దేరింది.

తార్నాకలోని స్కూల్‌కు వెళ్లే మార్గంలో హబ్సిగూడ మెట్రో స్టేషన్ కింద ఉన్న సిగ్నల్ వద్ద రెడ్ సిగ్నల్ పడటంతో ఆటో ఓ ఆర్టీసీ బస్సు వెనుకాల ఆగింది. ఈ క్రమంలో మెరుపు వేగంతో వచ్చిన భారీ ట్రక్ ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఆటో ఆర్టీసీ బస్సు కిందకి చొచ్చు కుపోయింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో క్రేన్ సహాయంతో ఆటోను బయటకు తీసి ఆటో డ్రైవర్, సాత్వికను స్థానిక ఆసుపత్రికి తరలించారు. తీవ్రం గా గాయపడిన సాత్విక చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆటో డ్రైవర్ ఎల్లయ్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు ట్రక్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. సాత్విక అకాల మరణంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.