రోజుల తరబడి నీటిలోనే!
బంగాల్ బాలుడి వింత ప్రవర్తన
కోల్‌కతా, ఆగస్టు 10: సాధారణంగా మనిషి ఎక్కువసేపు నీళ్లలో ఉండాలంటే ఇబ్బంది పడతాడు. కానీ ఓ 16 ఏళ్ల బాలుడు మాత్రం రోజుల తరబడి నీళ్లలోనే ఉంటూ అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తున్నారు.ఈ వింత ఘటన పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా బెల్దాంగాలో చోటు చేసుకుంది. ఆ బాలుడు వారంలో ఏకంగా నాలుగైదు రోజులు నీళ్లలోనే గడుపుతున్నాడు. ఒక్కోసారి వారం రోజు లపాటు రాత్రిపగలూ చెరువులో ఉంటున్నాడు. బయ టికి వస్తే ఒళ్లంతా మంటగా ఉంటోందని, నీళ్లలోనే హాయిగా ఉందని చెబుతున్నాడు.
బెల్దాంగాకు చెందిన ఇక్బాల్ షేక్ గత ఐదేళ్లుగా బయటకంటే నీళ్లలోనే ఎక్కువగా ఉంటున్నాడు. అతడు చెరువుల్లోనే ఎక్కు వగా గడుపుతున్నాడని స్థానికులు చెబుతున్నారు. అయితే శరీరంలో మంటగా అనిపించడం వల్లే నీటిలో ఉంటున్నానని ఇక్బాల్ చెబుతున్నాడు. నీళ్ల నుంచి బయటకు రాగానే మంట మొదలవుతుందని, నీటిలోకి వెళ్లగానే ఉపశమనం కలుగుతుందని అంటున్నాడు. ఇలా రోజుల తరబడి నీటిలో ఉండటంతో అతడు అనారోగ్యాల బారినప డుతున్నాడు.
చర్మవ్యాధులు వస్తున్నాయి. తరచూ జలుబు, దగ్గు వెంటాడుతున్నాయి. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకున్నా ఫలితం లేకుండాపోయింది. ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లే స్తోమత తమకు లేదని ఇక్బాల్ కుటుంబసభ్యులు చెబుతున్నారు. దాంతో అతడికి చికిత్స చేయించేందుకు స్థానికులు ముందుకొస్తున్నారు.






