11 August, 2026 | 3:57 AM

చిన్నారి సీట్ బెల్టు ధరించలేదని.... విమాన సర్వీస్ రద్దు

11-08-2026 01:01 AM

ఒట్టావా, ఆగస్టు 10: ఓ చిన్నారి బాలిక సీట్‌బెల్ట్ పెట్టుకునేందుకు నిరాకరించడంతో ఏకంగా విమాన సర్వీసునే రద్దు చేశారు. ఈ ఘటన కెనడాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. విక్టోరియా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పోర్టర్ ఎయిర్‌లైన్స్ విమానం టొరంటోకు వెళ్లేందుకు సిద్ధమైంది. రన్‌వేపై టేకాప్‌కు సిద్ధంగా ఉన్న సమయంలో విమానంలోని ఓ బాలిక సీట్‌బెల్డ్ పెట్టుకోకుండా నిల్చోని ఉండటాన్ని సిబ్బంది గమనించారు. పాప తల్లి, క్యాబిన్ సిబ్బంది కలిసి బాలికకు సీట్‌బేల్ట్ పెట్టడానికి కొన్ని నిమిషాలపాటు ప్రయత్నించారు.

అయితే చిన్నారి ఎంతకూ వినకుండా ఏడు స్తూ మారాం చేయడంతో ఏమీ చేయలేకపోయారు. సీట్బెల్ట్ పెట్టుకోకపోతే విమానాన్ని టేకాఫ్ చేయడం అసురక్షితమని భావించిన సిబ్బంది వారిని దించేయాలని నిర్ణయించుకున్నారు. దాంతో విమానం తిరిగి టర్మినల్‌కు వెళ్లింది.

చిన్నారిని, ఆమె తల్లిదండ్రులను విమానం నుంచి దించేసి, నిబంధనల ప్రకారం వారి ఫ్లైట్ ప్లాన్లను తిరిగి ఫైల్ చేసేసరికి రాత్రి 12:30 గంటలు దాటింది.అప్పటికే రన్వేను మూసివేయడంతో విమాన సర్వీసును రద్దుచేశారు. దాంతో అందులోని ప్రయాణికులు రాత్రి విమానాశ్రయంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. మరునాడు వారిని అదే విమానంలో గమ్యస్థానాలకు తీసుకువెళ్లారు. ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఎయిర్‌లైన్స్ క్షమాపణలు చెప్పింది.