ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం
ఉమ్మడి జిల్లా రైతుల్లో ఆనందం
బాన్సువాడ, ఆగస్టు 23 (విజయక్రాంతి): ఉమ్మడి జిల్లాలో వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఆదివారం కురిసిన భారీ వర్షం ఊరటనిచ్చింది. పది రోజులుగా ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సైతం వర్షం ఉపశమనం కలిగించింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి కురూస్తున్న వర్షంతో జిల్లాలోని పలు ప్రాంతాలు తడిసిముద్దయ్యాయి.
లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో రహదారులు, కాలనీలు జలమయమయ్యాయి.పంటలకు ఊపిరి వర్షం కోసం ఎదురుచూస్తున్న వానాధార పంటలకు తాజా వర్షం ఎంతో ఉపయోగపడింది. ముఖ్యంగా వరి, పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, పెసర పంటలకు తగినంత తేమ అందడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. మరో కొన్ని రోజులు వర్షాలు లేకుంటే పంటలు దెబ్బతినే పరిస్థితి ఉండేదని రైతులు పేర్కొంటున్నారు.
ఆయకట్టు ప్రాంతాల్లో ఉత్సాహం నిజాంసాగర్ ఆయకట్టు పరిధితో పాటు బాన్సువాడ, కామారెడ్డి, జుక్కల్, ఎల్లారెడ్డి, గాంధారి, లింగంపేట్, భిక్కనూర్, సదాశివనగర్ ప్రాంతాల్లో కురిసిన వర్షంతో రైతుల్లో ఉత్సాహం నెలకొంది. సాగు పనులు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు.
ప్రాజెక్టులకు వరద నీరు భారీ వర్షాలతో నిజాంసాగర్, పోచారం, కోలాస్, శ్రీరాంసాగర్, కళ్యాణి ప్రాజెక్టులతో పాటు మంజీరా, గోదావరి నదుల్లోకి వరద నీరు చేరుతోంది. పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలు నీటితో నిండుతున్నాయి. నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం 13 టీఎంసీలకు చేరుకున్నట్లు సమాచారం. కౌలాస్ ప్రాజెక్టు లోకి భారీగా వరద నీరు చేరుతుంది.లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వ భారీ వర్షం ప్రభావంతో కామారెడ్డి, బోధన్, నిజామాబాద్ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచింది. మొత్తంగా ఈ వర్షం వానాకాలం పంటలకు ఎంతో మేలు చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.






