calender_icon.png 26 December, 2025 | 3:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మందుల ధరల పెంపు?

27-03-2025 12:14:43 AM

క్యాన్సర్, మధుమేహ మందులు మరింత ప్రియం?

వెల్లడించిన విశ్వసనీయ వర్గాలు

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మందుల ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ధరల పెరుగదల త్వరలోనే ఉంటుందని ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. క్యాన్సర్, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించిన మందుల ధరలు 1.7 శాతం మేర పెరగనున్నట్లు వారు పేర్కొన్నారు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగిస్ట్స్ (ఏఐవోసీడీ) జనరల్ సెక్రటరీ రాజీవ్ సింఘాల్ ‘బిజినెస్ టుడే’ తో మాట్లాడుతూ.. ‘ఎప్పుడైనా మార్కెట్లో 90 రోజులకు సరిపడా మందులు అందుబాటులో ఉంటాయి. కొత్త ధరలు అమలయ్యేందుకు రెండు మూడు నెలల సమయం పడుతుంది.’ అని పేర్కొన్నారు.

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన తనిఖీల్లో దేశంలోని ఫార్మా కంపెనీలు పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు తేలింది. దేశంలో మందుల ధరలను నిర్ణయించే నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) ఫార్మా కంపెనీలు 307 సందర్భాల్లో ఉల్లంఘనలకు పాల్పడినట్లు గుర్తించింది. మందుల తయారీకి అవసరం అయ్యే ముడిసరుకుల ధరలు పెరుగుతున్నందున ఈ పెంపు ఉపశమనం ఇస్తుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ మినిస్ట్రీ మందుల ధరలను తగ్గించిన కారణంగా 2022లో రోగులకు అత్యవసర మందులకు సంబంధించి దాదాపు రూ. 3,788 కోట్లు ఆదా అయినట్లు నివేదికలు చెబుతున్నాయి.