calender_icon.png 26 December, 2025 | 3:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సమస్యల పోరాటానికి కృషి

26-12-2025 02:11:59 PM

సీపీఐ సీనియర్ నాయకులు, మాజీ జిల్లా కార్యదర్శి బడ్రి సత్యనారాయణ

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ సీనియర్ నాయకులు, మాజీ జిల్లా కార్యదర్శి బడ్రి సత్యనారాయణ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న స్థాపించబడిన ఈ పార్టీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటాలు చేస్తూ ఎన్నో సమరాలు, త్యాగాలు చేసిందన్నారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో పలువురు విప్లవకారులు, దేశభక్తులు కలిసి కాన్పూర్‌లో సమావేశమై భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు సభ నిర్వహించారని, అదే సీపీఐ ఆవిర్భావ దినమని గుర్తుచేశారు. ప్రజా సమస్యలపై పాలకులపై పోరాటాలు నిర్వహించి అగ్రభాగాన నిలిచిన పార్టీ సీపీఐ అని పేర్కొన్నారు.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సీపీఐ కీలక పాత్ర పోషించిందని, దొరల బురుజులపై బరిసెలతో దాడి చేసి, రజాకార్లతో పోరాడి విజయం సాధించిందన్నారు. వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా పోరాడి, నైజాం పాలనను తరిమికొట్టడంలో కమ్యూనిస్టుల పాత్ర అపూర్వమని చెప్పారు. “దున్నేవాడికే భూమి” నినాదంతో లక్షలాది ఎకరాల భూమిని భూమిలేని పేదలకు పంపిణీ చేసిన ఘనత సీపీఐకే దక్కుతుందన్నారు. అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం కమ్యూనిస్టులు అపార త్యాగాలు చేశారని, పీడిత ప్రజల కోసం వెలలేని పోరాటాలు చేశారని పేర్కొన్నారు. బ్యాంకుల జాతీయీకరణ, ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటులో సీపీఐ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి దివాకర్ గౌడ్, సీపీఐ జిల్లా నాయకులు పిడుగు శంకర్, సీపీఐ మండల కార్యదర్శి అజయ్ తదితరులు పాల్గొన్నారు.