హైదరాబాద్‌లో పెరిగిన ఓటింగ్ శాతం
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 14 (విజయక్రాంతి): హైదరాబాద్ జిల్లాలో 2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరగడంపై జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. నగరంలోని సెటిల ర్లు వారి సొంత ప్రదేశాలకు వెళ్లినప్పటికీ, గతంలో కంటే ఓటింగ్ పెరగడంపై హర్షం వ్యక్తంచేశారు. 2019 పార్లమెంటు ఎన్నికల కంటే ఈసారి హైదరాబాద్ జిల్లాలో అదనంగా 3.73 శాతం ఓటింగ్ పెరిగినట్టు వెల్లడించారు. సికింద్రాబాద్ నియోజకవర్గం లో 2019లో 46.26 శాతం నమోదు కాగా, 2024లో 49.04 శాతం నమోదైంది. జిల్లాలో ఓటింగ్ పెరగడానికి చేపట్టిన స్వీప్ కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇచ్చాయన్నారు. ఓటింగ్ శాతం పెరగడానికి సహకరించిన అధికారులు, సిబ్బంది, మీడియా సంస్థలకు జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ ధన్యవాదాలు తెలిపారు.




