2 April, 2026 | 4:40 PM

బెట్టింగ్‌కు బానిసై గొలుసు దొంగతనం

15-05-2024 02:11 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 14 (విజయక్రాంతి) : బీటెక్ పూర్తిచేసి ఉద్యోగం కోసం నగరానికి వచ్చిన యువకుడు బెట్టింగ్‌లకు బానిసయ్యా డు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఓ ఇంట్లోకి చొరబడి వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు లాక్కొని పారిపోయాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం దొప్పలపూడి గ్రామానికి చెందిన కొండేటి నాగపృథ్వీ(23) బీటెక్ పూర్తి చేశాడు. ఉద్యోగం నిమిత్తం కొద్ది కాలం క్రితం నగరానికి వచ్చి, ఎల్లారెడ్డి గూడలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఈ క్రమంలో బెట్టింగ్‌లకు బానిసై అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చే మార్గంలేక దొంగతనాలను ఎంచుకున్నాడు. ఈ నెల12న ఎల్లారెడ్డిగూడలోని శాలివాహననగర్ కాలనీలో నివసిస్తున్న విజయలక్ష్మి(75) ఇంట్లోకి చొరబడ్డాడు. కిచెన్‌లో వంట చేస్తున్న వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కొని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నాగపృథ్వీని అదుపులోకి తీసుకున్నారు. కాజేసిన బంగారు గొలుసు (4 తులాలు)ను స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.