1 September, 2026 | 3:27 AM

పెరుగుతున్న అనుమతులు

09-06-2024 02:30 AM

మే నెలలో 300 ప్రాజెక్టులకు అనుమతి

141.73 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాలు

ఏప్రిల్‌లో కేవలం 28 లక్షల చదరపు అడుగులే

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతిని ధి, జూన్ 8 (విజయక్రాంతి): హైదరాబాద్ రియాల్టీ మళ్లీ ఊపందుకుంటోంది. వరుస ఎన్నికలతో గత ఎనిమిది నెలలుగా హైదరాబాద్ రియాల్టీలో కొంత సందిగ్ధత రావడంతోపాటు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఇంటి అనుమతుల జారీలో కొంత జాప్యం చేసింది. అయితే 2024 మే నెలలో రియాల్టీ పరిస్థితి మెరుగుపడింది. ఇంటి అనుమతుల జారీలో వేగం పెరిగింది.

కేవలం మే నెలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు సుమారు 300 ప్రాజెక్టులకు హెచ్‌ఎండీఏ అనుమతులు జారీ చేసింది. అనుమతులు పొందిన ప్రాజెక్టులు సుమారు 141.73 లక్షల అడుగుల్లో నిర్మాణాలు చేపడుతున్నాయి. ఇందులో కొన్ని బడా నిర్మాణ సంస్థల ప్రాజెక్టులు కూడా ఉన్నాయని హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. 2024 ఏప్రిల్‌లో కేవలం 28 లక్షల చదరపు అడుగుల మేర నిర్మాణాల కోసం మాత్రమే అనుమతులు మంజూరు కాగా, మే నెలలో మాత్రం నాలుగింతలు అధనంగా అనుమతులతో రియాల్టీ మళ్లీ ఊపందుకుందని చెప్పవచ్చు.

ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇక నుంచి పరిపాలనపై దృష్టి సారిస్తామని ముఖ్యమంత్ర రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రకటించిన సంగతి విధితమే. మున్ముందు హైదరాబాద్ రియాల్టీ మరింత గ్రోత్ నమోదు చేసుకుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే రియల్ ఎస్టేట్ వృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, అనుమతుల జారీలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహిరిస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని నిర్మాణ సంస్థల యజమానులు పేర్కొంటున్నారు.