నాలుగేళ్లలో రూ.1.3లక్షల కోట్లు
రియల్ రంగంలో రీట్స్, ఇన్విట్స్ ద్వారా రాబడి
ఆర్బీఐ గణాంకాల్లో వెల్లడి
హైదరాబాద్ సిటీబ్యూరో, ప్రధాన ప్రతినిధి, జూన్ 8 (విజయక్రాంతి): రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఉపకరించే రీట్స్, ఇన్విట్స్ ద్వారా గత నాలుగేళ్లలో ఏకంగా రూ.1.3 లక్షల కోట్లు వచ్చాయని ఆర్‌బీఐ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో ఈ మొత్తం వచ్చినట్టు ఆర్బీఐ వెల్లడించింది. భవిష్యత్తులో కూడా ఈ జోరు కొనసాగుతుందని ఆర్బీఐ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్టులు (రీట్స్), ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ ఇన్వెస్ట్‌మెంట్స్ ట్రస్టులు (ఇన్విట్స్) రియల్ రంగంలో పెట్టుబడులకు గమ్యస్థానంగా ఉద్భవించాయని, పెట్టుబడులకు సురక్షితంగా ఉన్నందున ఎక్కువ మంది వీటి పట్ల ఆసక్తి కనబరుస్తున్నారని ఆర్బీఐ పేర్కొంది. భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా అభివృద్ధి పథం వైపు పయనిస్తుండటంతో పెట్టుబడులకు రీట్స్, ఇన్విట్స్‌ను ఎక్కువ మంది ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు.
ముఖ్యంగా అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు (హెచ్‌ఎన్‌ఐ) వీటి వైపు మొగ్గు చూపిస్తున్నారు. 2024 మార్చిలో పబ్లిక్ ఇష్యూ ద్వారా ఏకంగా రూ.2,500 కోట్ల మేర ఇన్విట్స్ వచ్చాయి. కనీస పెట్టుబడి మొత్తాన్ని సెబీ తగ్గించిన నేపథ్యంలో ఎక్కువ మంది ఇందులో ట్రేడ్ చేస్తున్నారు. ఫలితంగా రీట్స్ ఎక్కువగా వస్తున్నాయి. లాట్ సైజును తగ్గిస్తూ సెబీ తీసుకున్న నిర్ణయంతో పాటు ఇతరత్రా అంశాలు రీట్స్ ను ఆకర్షణీయమైన పెట్టుబడి సాధనంగా మార్చాయని ఇండియన్ రీట్ అసోసియేషన్ తెలిపింది.






