మహనీయుల స్ఫూర్తితో దేశ సేవకు అంకితభావంతో పని చేయాలి
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
భూపాలపల్లిటౌన్, ఆగస్టు 15 (విజయక్రాంతి) : దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయులను స్మరించుకోవాలని, వారి స్ఫూర్తితో దేశ సేవకు అంకితభావంతో పని చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించగా ఎస్పీ సిరిశెట్టి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసు అధికారులు, సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు శాఖ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో కీలక బాధ్యతలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ప్రజలతో మరింత సన్నిహితంగా ఉంటూ, వారి సమస్యలను గౌరవంగా విని, చట్టపరంగా వేగంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని పోలీసు అధికారులకు, సిబ్బందికి సూచించారు. అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి నరేష్ కుమార్, భూపాలపల్లి డీఎస్పి సంపత్ రావు, కాటారం డీఎస్పి సూర్యనారాయణ, ఏఒ ఫర్హానా, ఆర్ఐలు, డీపీఒ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






